Magazines

నాణ్యత పేరుతో అందరికీ విద్యను దూరం చేయకండి

1 గంట క్రితం

Right to Education Act
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

పీఆర్సీ అమలు ఆలస్యమైతే మరొక పోరాటం తప్పదు : టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్ ​‘
విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలు అందుబాటులో ఉండాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తామనే పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అందుబాటులో లేకుండా చేయడం సమంజసం కాదు. నాణ్యత పేరుతో అందరికీ విద్యను దూరం చేయొద్దు’ అని టీఎస్ యూటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన హైదరాబాద్‌‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం1986 లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో భాగంగా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని నిబంధన ఉందని గుర్తు చేశారు.ఆ నిబంధనను పట్టించుకోకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా పాఠశాలలను కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు అవసరమైన ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని, ఆ పేరుతో ఉన్న పాఠశాలలను మూసివేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిన జీవో 25ను సవరించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయులపై యాప్ ల భారాన్ని తొలగించాలని, బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాలకు, మండలాలకు విద్యాధికారుల పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని కోరారు. సర్వీసు నిబంధనల సమస్యను పరిష్కరించి ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోకుంటే నవంబర్ లో మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డుల జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి అర్హులైన వారందరికీ కార్డులు అందజేయాలని ఆయన కోరారు. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. తాత్కాలిక ఉపశమనంగా ఇచ్చిన జీవో 190 అమలు చేయడం లేదన్నారు. బాధితులందరికీ వెంటనే న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సీపీఎస్ ను రద్దు చేయాలని, మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీయస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్స్ స్కేల్ ను అమలు చేయాలని, మోడల్ స్కూళ్లను ప్రభుత్వం పూర్తిగా తమ ఆధ్వర్యంలోకి తీసుకుని 010 పద్దు కింద ఉపాధ్యాయులందరికీ వేతనాలు అందించాలన్నారు. 317 జీవోను మోడల్ స్కూళ్లలో అమలు చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని గురుకులాలకు మాదిరిగా మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల టైం టేబుల్ ను సవరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2009 విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించి పార్లమెంటులో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా రంగంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యాపారీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు అక్టోబర్ 17న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయిలో సామూహిక నిరాహారదీక్ష నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ నిర్ణయించింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర 7వ ద్వైవార్షిక మహాసభలు డిసెంబర్ 26,27,28 తేదీల్లో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నగరంలో జరపాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ లోగా అన్ని మండలాలు, జిల్లాల మహాసభలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గా భవాని, ఎం.రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శాంతకుమారి, సమ్మారావు, సత్యానంద్, బి.రాజు, రంజిత్ కుమార్, రవి కుమార్, శ్రీధర్, సింహాచలం, జ్ఞాన మంజరి, వెంకటప్ప, విశాలి, యాకయ్య, కొండలరావు, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్