Magazines

‌గురుకులాల్లో విద్యాప్రమాణాలు బలోపేతం చేయాలి

46 నిమిషాల క్రితం

సాంఘిక సంక్షేమ శాఖ ప
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

యూనిఫారాలు, ష్యూ, పుస్తకాలు సకాలంలో అందాలి
శానిటేషన్‌, భద్రత, తాగునీరు, వంటశాలలపై ప్రత్యేక దృష్టిసారించాలి
ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫారాలు, ష్యూ, పుస్తకాలు తదితర వస్తువులు ఆలస్యం లేకుండా సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో గురుకులాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పీఎంయూ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.​

సరఫరా ఎక్కడ నిలిచిపోయింది
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు చేరిన యూనిఫారాలు, ష్యూ, పుస్తకాలు తదితర సామగ్రిని విద్యార్థులకు వెంటనే అందించాలని మంత్రి సూచించారు. సరఫరా ఎక్కడ నిలిచిపోయిందని ప్రశ్నించారు. కొనుగోలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలను గుర్తించి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశానికి నిర్దిష్ట గడువు నిర్ణయించి, పురోగతిపై నివేదికలు తీసుకోవాలని కోరారు. వందలాది మంది విద్యార్థులు ఉండే పెద్ద క్యాంపస్‌లలో ప్రస్తుత పారిశుద్ధ్య సిబ్బంది సరిపోతున్నారా అనేది పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట్ల పారిశుద్ధ్య, స్కావెంజింగ్‌ సేవలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన విధానం రూపొందించాలన్నారు. స్థానిక అవసరాలను బట్టి కాంటింజెన్సీ సిబ్బందిని వినియోగించడంతోపాటు, అవసరమైతే పారదర్శక ఆన్‌లైన్‌ టెండర్‌ విధానాన్ని పరిశీలించాలని చెప్పారు. ప్రస్తుతం సిబ్బందికి అందిస్తున్న వేతనాలు చాలా తక్కువ ఉన్నాయనీ, వాటిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.​ విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, అవసరమైన చోట్ల భద్రతా సిబ్బంది, పోలీసు సమన్వయం, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. బాలికల గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని స్థానిక పోలీస్ స్టేషనకు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

అద్దె భవనాల జీఎస్టీపై ఒప్పందాల్లో పేర్కొనాలి
గురుకులాలు, విద్యా సంస్థలకు సంబంధించిన అద్దె భవనాలపై జీఎస్టీ వర్తింపు అంశాన్ని కూడా సమీక్షించామని మంత్రి అన్నారు. అద్దె రేటు జీఎస్టీతో అదనంగా కలపడం అనే విషయాన్ని ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించామని చెప్పారు. విద్యా సంస్థలు, వసతి గృహాలకు వర్తించే జీఎస్టీ నిబంధనలు, మినహాయింపులపై పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్య సాచి ఘోష్, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోతు, ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, ఆశ్రమ పాఠశాలల డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు పోటీ పరీక్షలపై మార్గదర్శనం కల్పించాలి

హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న సబ్జెక్టు నిపుణుల సేవలను జిల్లాల విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్‌ తరగతులు నిర్వహించాలని మంత్రి అన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌, డిజిటల్‌ లెర్నింగ్‌ వనరులు, అదనపు కోచింగ్‌ అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు మార్గదర్శనం కల్పించాలని సూచించారు. మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. నియామకాల సమయంలో పోస్టుల మంజూరు, రోస్టర్‌, సీనియార్టీ, నియామక విధానం, ఆర్థిక శాఖ అనుమతులను పరిగణనలోకి తీసుకున్నారా? అనే అంశాలను ధ్రువీకరించాలని సూచించారు. సంబంధిత వివరాలను గవర్నింగ్‌ బాడీ ముందుంచి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్