- 500 గజాల్లోపు వారి సమస్య నెలరోజుల్లో పరిష్కారం
- కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ : రాష్ట్రంలో 59 జీవో దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 500 గజాల్లోపు ఉన్న దరఖాస్తుదారుల సమస్యను నెలరోజుల్లోపు పరిష్కరించాలని నిర్ణయించింది. జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ లోకేశ్ కుమార్ శుక్రవారం మెమో నెంబర్ 48030ను జారీ చేశారు. 22ఏ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 59 జీవో అమల్లో అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో 59 జీవో అమల్లో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. 22ఏ సమస్య పరిష్కారంపై శరవేగంగా చర్యలు : పొంగులేటి రాష్ట్రంలో 22ఏ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులను జారీ చేశామని వివరించారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22ఏ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 22ఏకు సంబంధించిన 10–12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్నామని తెలిపారు. 118 జీవో, 76 జీవోలకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేశామని పేర్కొన్నారు. 22ఏలో ఉన్నా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులున్న ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపామని తెలిపారు.





కామెంట్‌లు (0)