కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి కోలిండియా సీఎస్ఆర్ నిధులు రూ.100 కోట్లు ఇవ్వండి
సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు వేగవంతం చేయాలి
రైల్వే ప్రాజెక్టులకు, లైన్లకు నిధులివ్వండి
సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలి :కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మహానది క్షేత్రాల నుంచి బొగ్గును కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చే ఆ కేంద్రానికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది ప్రధాన అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కోలిండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే సింగరేణి నిర్వహిస్తున్న గనులకు సమీపంలో ఈ బ్లాక్ ఉండటంతో అందుబాటులోని మౌలిక వసతులను వినియోగించుకోవచ్చని వివరించారు. తవ్వకాలు త్వరగా ప్రారంభించడంతోపాటు అదనపు భూసేకరణ అవసరాన్ని, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే అవకాశముంటుందని చెప్పారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోతుండటంతో రాష్ట్రంలో యూరియా సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జె.పి.నడ్డాతో చర్చించి రాష్ట్రంలో ఎరువుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తెలంగాణ అవసరాలకు అనుగుణం గా యూరియా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానా శ్రయం ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా రైల్వే శాఖతో సమన్వయం చేయాలని విన్నవించారు. సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి కొత్త రైల్వే లైన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణా సులభమవుతుందనీ, ఖమ్మం ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌తో రైలు అనుసంధానం మెరుగుపడి వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఇప్పటికే మంజూరైన పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలనీ, గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా భద్రాచలం సమీపంలోని సారపాక వరకు రైల్వే సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తుమ్మల సమర్పించిన వినతులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. కోల్ ఇండియా ఎమ్‌డీతో ఫోన్లో మాట్లాడి వర్సిటీకి నిధుల మంజూరుపై మాట్లాడారు. మిగతా సమస్యలపై సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






కామెంట్లు (0)