Magazines

సరికొత్త ఆలోచన

-1087 నిమిషాల క్రితం

A brand-new idea
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం



ఒకప్పుడు బొగ్గుతో రైళ్లను నడిపేవారు. వాటి స్థానంలో డీజిల్‌ వచ్చింది. క్రమంగా అదీ తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా విద్యుత్‌ ద్వారానే ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం రైల్‌ నెట్‌వర్క్‌లో 99 శాతం మేర విద్యుదీకరణ జరిగింది. దీని వల్ల కాలుష్యం తగ్గినప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతోంది. అలాగే ఎక్కువ మొత్తంలో విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఖర్చు తగ్గించుకోవడం కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆలోచన చేసింది. హైడ్రోజన్, ఎల్​ఎన్​జీతో నడిచే రైళ్లను ప్రారంభించింది. ఇవే భవిష్యత్తు రైళ్ల ఇంధనంగా ఉంటాయని చెబుతోంది.

జులై 17న ఉత్తర రైల్వేలోని జింద్- సోనిపట్ మార్గంలో హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ఇందులో పది కోచ్​లు ఉన్నాయి. విద్యుత్​ను రైలులోనే ఉత్పత్తి చేసుకోవడం ఈ ట్రైన్ ప్రత్యేకత. ఇందులో ఉండే ఫ్యూయల్ సెల్స్ విద్యుత్​ను తయారుచేస్తాయి. సెల్​లోని హైడ్రోజన్, గాలిలో ఉండే ఆక్సిజన్​తో రసాయనిక చర్య జరపడం ద్వారా కరెంటు ఉత్పత్తవుతుంది. హైడ్రోజన్ రైలుకు రెండు డ్రైవింగ్ పవర్ కార్​లు ఉంటాయి. ఉత్పత్తి అయ్యే కరెంటు బ్యాటరీ ద్వారా ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను తిప్పుతుంది. ఈ ట్రైన్​ను మొదట వాడిన దేశం జర్మనీ. ఇది​ గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్​తో ప్రయాణిస్తుంది. శుద్ధ ఇంధన పరిజ్ఞానంతో నడిచే ఈ రైలులో ధ్వని కూడా తక్కువే.

హైడ్రోజన్​ రైలులో నాన్‌స్టాప్‌ వెంటిలేషన్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు గాలి బయటకు వెళ్లేలా చూస్తుంది. అనుకోకుండా ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి, పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే, ఆటోమేటిక్‌ షట్‌ఆఫ్‌ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్‌ సప్లైను ఆపేస్తుంది. ఇక ఈ ట్రైన్​లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలున్నాయి. అవి హైడ్రోజన్‌ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఉత్పన్నమైతే సెకన్లలోనే అలర్ట్ చేస్తాయి. సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ ఇందులో లోకోపైలట్‌ క్యాబిన్‌ను స్పెషల్​గా డిజైన్‌ చేశారు. లోకో పైలట్‌ ఎదుట ఉండే ఒక స్క్రీన్‌, ఎప్పటికప్పుడు అన్ని అంశాలను తెలియజేస్తుంది.

గుజరాత్​లోని సబర్మతి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 27న డీజిల్​తో పాటు ఎల్ఎన్​జీతో(లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) నడిచే రైలు ప్రారంభమైంది. 1,400 హార్స్​పవర్ సామర్థ్యం ఉన్న రెండు పవర్ కార్​లను మార్పులు చేసి డీజిల్, ఎల్ఎన్​జీతో నడిచేలా చేశారు. ఇది పూర్తిగా ఎల్ఎన్​జీతో నడవదు. కాకపోతే డీజిల్​పై ఆధారపడటం తగ్గుతుంది. డీజిల్ వినియోగంలో 40 శాతం వరకు ఎల్​ఎన్​జీతో భర్తీ చేస్తారు. రెండు పవర్ కార్లు, 8 బోగీల ఎల్ఎన్​జీ రైలుతో ఏడాదికి రూ.23.90 లక్షల ఇంధన వ్యయం ఆదా కావచ్చన్నది రైల్వేశాఖ అంచనా. అయితే ఇది పూర్తిగా పొగరహిత రైలు కాదని గుర్తుంచుకోవాలి. డీజిల్ రైళ్లు ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడుతున్నా ఇంధన వినియోగంతో కాలుష్య ఉద్గారాలు ఉంటాయి. ఖరీదైన డీజిల్ ఇంజిన్లను నిరుపయోగం చేయాల్సిన అవసరం లేకుండానే ఎల్ఎన్​జీ ద్వారా ఉపయోగించుకోవచ్చు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్