ఏసీబీకి చిక్కుతున్న అధికారులు
రంగారెడ్డిలో రియల్టర్లతో కుమ్మక్కు
తహసీల్దార్ ఆఫీసుల్లో వారికి ప్రత్యేక కుర్చీలు
ప్రభుత్వ పెద్దల పేరుతో చెలాయింపు
అప్రతిష్ట పాలవుతున్న రెవెన్యూ వ్యవస్థ
వ్యక్తుల పనితీరు వ్యవస్థపై నమ్మకాన్ని నిర్ధారిస్తోంది. ఆ వ్యవస్థలో ఒక వ్యక్తి చేసిన అప్రతిష్ట పని... మొత్తం వ్యవస్థకు మచ్చతెస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత మంది రెవెన్యూ అధికారులు చేస్తున్న అవినీతి పనులతో ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. రెవెన్యూ అధికారులతో న్యాయబద్ధమైన పనులు కూడా అక్రమ పద్ధతుల్లో వెళ్లితేనే సాధ్యమన్న నానుడి ఉంది. ఇందుకు నిదర్శనం రెవెన్యూ అధికారులు రియల్టర్లతో కుమ్మకై, విలువైన భూములు అప్పన్నంగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల పేరుతో రెవెన్యూ అధికారులు దందాలు చేస్తున్న పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో నిత్యకృత్యంలా మారింది. అయితే కొందరు అధికారులు ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. దాంతో రెవెన్యూ వ్యవస్థపైనే అపనమ్మకం కలుగుతోంది.
నవతెలంగాణ–రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ దందా యథేచ్ఛగా సాగుతోంది. విలువైన భూములు కొట్టేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు, వారి అనుయాయులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాపుకాసుకుని కూర్చుంటున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. ఆ భూములు ప్రభుత్వానివా, ప్రయివేటు రైతులకు సంబంధించినవా వారికి అనవసరం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. అధికారుల అండతో భూ రికార్డులు, యాజమాన్య హక్కులు, సర్వే వివరాలు వారికి అనుకూలంగా మార్చుకొని శంషాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఇబ్రహీం పట్నం తదితర ప్రాంతాల్లో భూములు కొల్లగొడుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా...
మండల కేంద్రాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. ఇందుకు ఊదాహరణే.. ఇటీవల ఇబ్రహీంపట్నంలో రాందాస్‌పల్లి రెవెన్యూ పరిధిలో నిషేదిత జాబితాల్లోని భూములకు రియల్టర్లు క్లియరెన్స్ తెచ్చుకోవడం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నారు. అదే రైతు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే మాత్రం 22ఏ అడ్డు వస్తోంది. కేశంపేట మండలంలో ఇటీవల ఓ రైతు బతికుండగానే.. మరొకరి పేరున అధికారులు ఆ భూమిని రిజిస్ర్టేషన్ చేశారు. షాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులదే హవా. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తహసీల్దార్ కార్యాలయంలో అడుగు పెడితే చాలు పనులు చకచక అయిపోతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే కందుకూరు, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ఏసీబీకి చిక్కుతున్న అధికారులు
రెవెన్యూ కార్యాలయాల్లో రియల్ వ్యాపారం జరగడం, సామాన్యులకు న్యాయం జరగక పోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు మార్చడానికి లంచం డిమాండ్ చేస్తూ అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. అదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే కారణంలో సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసు ఏవో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. తలకొండపల్లి, ఆమనగల్ తహసీల్దార్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులపై దాడులు జరగడం, రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారడంతో రెవెన్యూ వ్యవస్థ పనితీరుపైనే ఆందోళన కలుగుతోంది.







కామెంట్‌లు (0)