Magazines

రేడియల్‌ రోడ్‌-2 టెండర్లలో కుంభకోణం

51 నిమిషాల క్రితం

Scandal in Radial Road-2 tenders
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

నచ్చిన వారికే టెండర్లు కట్టబెట్టిన ప్రభుత్వం

తక్కువ ధరకు బిడ్లు వేసిన వారికి అన్యాయం

టెండర్లు రద్దు చేసి

సమగ్ర విచారణ జరపాలి :
సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌

బహిరంగ లేఖ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రాష్ట్రంలో రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియల్‌ రోడ్‌-2 టెండర్లలో కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ టెండర్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ శనివారం బహిరంగ లేఖ రాశారు. బుద్వేల్‌ నుంచి కొడంగల్‌ సమీపంలోని జాతీయ రహదారి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి చేపట్టిన టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించి, ముందుగా నిర్ణయించుకున్న సంస్థలకే కట్టబెట్టారనే అనుమానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను పక్కనపెట్టి, ఎక్కువ ధరలకు కోట్‌ చేసిన సంస్థలకు పనులు కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. బుద్వేల్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి కొడంగల్‌ సమీపంలోని ఎన్‌హెచ్‌-167ఎన్‌ వరకు 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. గతనెల 30తో బిడ్ల దాఖలు గడువు ముగిసిందని తెలిపారు. ఈనెల ఎనిమిది నాటికే సాంకేతిక మూల్యాంకనం, బిడ్డర్ల అర్హతల పరిశీలన, ఆర్థిక బిడ్ల పరిశీలన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్టు సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారని వివరించారు. సెలవులను మినహాయిస్తే కేవలం ఐదు పని దినాల్లోనే రూ.3,296 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తిచేశారని ప్రశ్నించారు. ప్రతి ప్యాకేజీకి ఎన్ని సంస్థలు బిడ్లు వేశాయి? ఎన్ని అర్హత సాధించాయి? ఏ సంస్థ ఎంత ధర కోట్‌ చేసింది? అంచనా వ్యయంతో పోలిస్తే తుది కేటాయింపు ఎంత ఎక్కువగా ఉంది? అనే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకే సంస్థకు ఒక ప్యాకేజీలో అర్హత, మరో ప్యాకేజీలో అనర్హత ఎలా?అని ప్రశ్నించారు. అతి తక్కువ ధరకు బిడ్లు వేసినట్టు చెబుతున్న సుషీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ను మూడు ప్యాకేజీల్లోనూ అనర్హులుగా ప్రకటించిన అంశంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ సంస్థను అనర్హతగా ప్రకటించడం వల్ల మూడు ప్యాకేజీల్లో కలిపి రాష్ట్రానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్థ తరఫున కోర్టులో సమర్పించిన వాదనల్లో పేర్కొన్నట్టు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్