వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు ప్రవేశపెట్టాలి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ముషీరాబాద్
కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించి, వృత్తిలో ఆధునీకరణ పద్ధతులను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 14న నిర్వహించనున్న కల్లుగీత వృత్తి ఆధునీకరణ రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సుందరయ్య కళానిలయంలో శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. 50 ఏండ్లు నిండిన 37,381 మంది గీత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్‌ను రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ.. కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు, ద్విచక్ర వాహనాలు అందించాలని కోరారు. చెట్ల పెంపకానికి సొసైటీలకు ఐదెకరాల భూమి కేటాయించాలని, నందనంలో నీరా-తాటి-ఈత ఉత్పత్తుల ప్రాజెక్టును ప్రారంభించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో సొసైటీలను పునరుద్ధరించాలని అన్నారు. రాష్ట్ర సదస్సుకు గీత కార్మికులు, సొసైటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉషగోని వెంకట నరసయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వర్కాల బాలరాజు గౌడ్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ కృష్ణస్వామి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కార్యదర్శి కప్పల లింగం గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కోలా జనార్ధన్, సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ గౌడ్, నాయకులు క్రాంతి, రేవంత్ గౌడ్, నవీన్, చంద్రయ్య, పొన్నం రాజయ్య పాల్గొన్నారు.
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
41 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)