Magazines

ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

39 నిమిషాల క్రితం

People's movements must be strengthened.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలి : బి. వెంకట్‌ 10న దేశవ్యాప్త నిరసనలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 10న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పిలుపునిచ్చారు. శ‌నివారం నాడిక్క‌డ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలకు వ్య‌వ‌సాయ కార్మికులు సంపూర్ణ మద్దతు ఉంద‌ని తెలిపారు. ప్ర‌జా ఉద్యమాల‌ను మరింత విస్తృతం చేయాలని అన్నారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హులైన కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. జ్ఞానేష్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరమని, రాష్ట్రపతి వెంట‌నే జోక్యం చేసుకుని ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 10న గ్రామాలు, పట్టణాలు, బస్తీలు, కార్మికవాడల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ప్రతి కుటుంబం పరిశీలించాలని, తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జాబ్ చోరీ నరేంద్ర మోడీ గద్దె దిగాలి : కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లను తొలగించే నేరపూరిత చర్యకు పాల్పడిన సీఈసీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల హక్కును హరించే చర్యలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషనరేనని అన్నారు. ఒక వైపు అధికార దాహం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగించి ప్రజలకు ఓట్లు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమ‌ర్శించారు. ఓటు చోరీకి, జాబ్ చోరికి పాల్పడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని అన్నారు. అనేక ఆంక్షలు విధించినప్పటికీ, బారికేడ్లు పెట్టి అడ్డుకున్నప్పటికీ విద్యార్థి, యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వైపు కదం తొక్కారని అన్నారు. తక్షణమే జ్ఞానేశ్‌ కుమార్‌ను అరెస్ట్ చేయాలని అక్టోబర్ 10న డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింద‌ని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనల్లో విద్యార్థి, యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతారని తెలిపారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేసి, నిధులను కేటాయించి, తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్