Magazines

వడ్లు మాకొద్దు

1 గంట క్రితం

We don't want paddy.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

కలెక్టర్లకు రైస్‌ ‌మిల్లర్ల లేఖలు
బియ్యం నిల్వలతో ఇబ్బందులు
ఖరీఫ్‌ ‌ధాన్యానికి స్థలం కరువు
కొనుగోళ్లు ప్రారంభమవుతుండటంతో తలలు పట్టుకుంటున్న అధికారులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘రెండు, మూడు సీజన్ల నుంచి రైస్‌ ‌మిల్లుల్లో పేర్కుపోయిన ధాన్యం నిల్వలు, వాటిని తరలించడం అధికారుల నిర్లక్ష్యం, కొత్తగా వచ్చే ఖరీఫ్‌ ‌ధాన్యానికి చోటు లేకపోవడం...వీటితోపాటు రైస్‌ ‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోవడం తదితర కారణాలతో సేకరించనున్న ధాన్యం మాకొద్దు’ అంటూ మిల్లర్లు మొండికేస్తున్నారు. ఆయా జిల్లా సివిల్‌ ‌సప్లయ్‌ అధికారులకు, కలెక్టర్లకు లేఖలు అందజేస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతుండటంతో రైస్‌ ‌మిల్లర్లు ఈ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వానాకాలం ధాన్యం సేకరణకు ముందే మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ వానాకాలం ధాన్యాన్ని కేటాయిస్తే నిర్వహణ సాధ్యం కాదని, కొత్త ధాన్యం తమకు కేటాయించొద్దంటూ జిల్లాల వారీగా విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేటాయింపులిలా...
రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా మిల్లులు ఉన్నాయి. టూ టన్స్ మిల్లులకు ప్రభుత్వం 15వేల క్వింటాళ్లు, నాలుగు టన్నుల మిల్లులకు 30వేల టన్నులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ మిల్లుల సామర్ధ్యాన్ని బట్టి మిల్లింగ్‌ ‌కోసం ధాన్యాన్ని కేటాయిస్తుంది. అయితే గత వానాకాలం, యాసంగిలో పంట ఎక్కువగా రావడంతో రెట్టింపు స్థాయిలో ధాన్యాన్ని మిల్లులకు కేటాయించింది.ఈ ధాన్యాన్ని 45 రోజులు లేదా మూడు నెలల్లోగా ప్రభుత్వానికి బియ్యం(సీఎంఆర్)ను ఇవ్వాల్సి ఉంటుంది. గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన ధాన్యం, బియ్యం నిల్వలు50 శాతానికిపైగా ఇంకా పూర్తిగా గోదాములు, మిల్లుల్లోనే స్టాక్ ఉన్నది. ధాన్యం సైతం చాలా మిల్లుల్లోనే ఉంది. ఇప్పటికే ఉన్న స్టాక్‌ కారణంగా కొత్త ధాన్యం మిల్లులకు వస్తే దాన్ని ఎక్కడ నిల్వ చేయాలన్నది ప్రశ్నగా మారింది. ఎఫ్‌సీఐకి పంపిన బియ్యం వాహనం నాణ్యతా ప్రమాణాలకు సరిపోలేదని..0.5శాతం ఎక్కువగా నూక వచ్చినా బియ్యాన్ని వెనక్కి పంపితే మిల్లర్లపై అదనపు భారం పడుతోంది. వాహన రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మళ్లీ ప్రాసెసింగ్‌, కార్మికుల ఖర్చులు తదితరాలు కలిపి ఒక్కో వాహనం వెనక్కి వస్తే భారీ నష్టం వాటిల్లుతోంది.ధాన్యం నాణ్యతను పరీక్షించేందుకు గ్రేడర్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా తమపై అదనపు భారం మోపుతోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల సామర్థ్యం, ప్రస్తుతం ఉన్న నిల్వలు, గతంలో తీసుకున్న ధాన్యం, పెండింగ్‌ సీఎంఆర్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త ధాన్యం కేటాయించాలని మిల్లర్లు కోరుతున్నారు.

ధాన్యం సేకరణకు సర్కారు ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రైతుల నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ పరిస్తితుల్లో వడ్లు కేటాయించొద్దంటూ మిల్లర్లు చేస్తున్న విజ్ఞప్తులతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం వానాకాలం ధాన్యం సేకరణ సిద్ధమవుతున్నారు. వానాకాలం ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిల్లర్ల వినతులపై ప్రభుత్వం, సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండింటి మధ్య పౌరసరఫరాల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఎలా సమన్వయం సాధిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్