ఏడాదిలోనే కులగణన పూర్తి చేశాం
ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చే అంశంపై అధ్యయనం
ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పండుగ సాయన్న,
దొడ్డి కొమరయ్య విగ్రహాలు ప్రతిష్టిస్తాం
పండుగ సాయన్న ముదిరాజ్
174వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని సాహసోపేతమైన కులగణనను తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 2024 ఫిబ్రవరి 4న కమిషన్ ఏర్పాటు చేసి, ఏడాదిలోపే అంటే 2025 ఫిబ్రవరి 4 నాటికి లెక్కలు తేల్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఎవరి వివరాలైనా నమోదు కాకపోతే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, సామాజిక న్యాయమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై గురువారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకల్లో సీఎంగా పాల్గొన్నారు.
సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక తరగతిని బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూస్వాములు, పెత్తందారుల దౌర్జన్యాలను ఎదిరించి పేదల భూముల విముక్తి కోసం పోరాడిన యోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. ఆయన పాలమూరు జిల్లా గడ్డపై జన్మించడం గర్వకారణమన్నారు. సాయన్న విగ్రహంతోపాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ప్రతిష్టిస్తామని తెలిపారు. జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి నిరుపేదలు, బహుజనుల భూములను రక్షించేందుకు దళాలను నిర్మించిన పాలమూరు బిడ్డ పండుగ సాయన్న చరిత్ర భావితరాలకు తెలియాలని సీఎం అన్నారు. ఆయనకు చరిత్ర పుటల్లో, పాఠ్యాంశాల్లో సముచిత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముదిరాజ్ కమ్యూనిటీని గతంలో మరో గ్రూపులోకి మార్చేందుకు ప్రయత్నించినప్పటికీ, తగినన్ని అధికారిక లెక్కలు లేవన్న కారణంతో న్యాయస్థానాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన ప్రాతిపదికన ఇప్పుడు పక్కా లెక్కలు ఉన్నాయని, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ రాకుండా ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని స్పష్టం చేశారు. తద్వారా గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే అపోహలు కొందరిలో ఉన్నాయన్నారు. ఆయా తరగతుల వారితో చర్చించి అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కదానినీ నిలిపివేయకుండా, మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)