అర్హులైన పేదలందరికీ ఇండ్ల కేటాయింపులు చేపట్టాలి
కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే జాబితాలో
పేరు అనడం అప్రజాస్వామికం
వామపక్ష పార్టీలు, బీఆర్ఎస్ నాయకులు
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం నిరసన
రాజకీయ పార్టీల జోక్యం లేకుండా చేస్తాం : కలెక్టర్ హామీ
నవతెలంగాణ – ఖమ్మం కలెక్టరేట్
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అక్రమాలు, రాజకీయ వివక్ష చోటుచేసుకుంటున్నాయని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు ఉంటుందని చెప్పడం అప్రజాస్వామికమని, ఇటువంటి చర్యలను సహించబోమని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గురువారం వామపక్ష పార్టీలు, బీఆర్ఎస్, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. పేదలకు పార్టీల రంగు పూయకుండా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని అధికార పార్టీకి హితవు పలికారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పేరుతో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామసభల అధికారాలను పక్కనపె ట్టడం సరికాదన్నారు. లబ్దిదారులఎంపిక అధికారాలను గ్రామసభలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కమిటీలకు చట్టబద్ధత లేదన్నారు. నిబంధనల ప్రకారమే అధికారులు వ్యవహరించాలని, పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రతిఘటిస్తామని తెలిపారు. మంత్రులను అడ్డుకోవడంతోపాటు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట అవసరమైతే లాటరీ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ.. మొదటి, రెండో, మూడో విడతల్లో పేదలందరికీ ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సర్పంచ్ చైర్మెన్‌గా ఉండాల్సి ఉన్నప్పటికీ, వారి ప్రమేయం లేకుండానే ఇండ్ల కేటాయింపులు జరుగుతున్నాయని అన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు జీవై పుల్లయ్య మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహాధర్నా అనంతరం అఖిలపక్ష నాయకులు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, ఎంపిక ప్రక్రియలో రాజకీయ పార్టీల జోక్యం లేకుండా, పారదర్శకంగా అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, న్యూడెమోక్రసీ నాయకులు బండారు ఐలయ్య, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, బీఆర్ఎస్ జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ లింగాల కమల్ రాజ్, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, అఖిలపక్ష పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)