Magazines

దీపావళి... తిమిరం నుంచి చైతన్యకిరణం వరకు

2 రోజుల క్రితం

Diwali... From Darkness to a Ray of Consciousness
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 5 నిమిషాల చదవడం

చీకటిని తొలగించడానికి ఒక దీపం చాలు. కానీ అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక ఆలోచన కావాలి. దీపావళి మనకు ఈ విషయాన్నే ప్రబోధిస్తుంది. వెలుగును కేవలం కళ్లతో చూడటం కాదు, దాని తాత్త్వికతను మనసుతో గ్రహించాలి. ప్రమిదలో వెలిగే చిన్న జ్యోతి నుంచి విశ్వచైతన్యం వరకు, వ్యక్తిగత ఆనందం నుంచి సామాజిక బాధ్యత వరకు దీపానికి ఎన్నో అర్థాలున్నాయి. వాటన్నింటినీ కలిపి చూస్తే దీపావళి కేవలం పండుగ కాదు. మానవ నాగరికత నిర్మించుకున్న ఒక అద్భుతమైన వెలుగుల అంతరార్థం.

ఆకాశమంతా నక్షత్రాలు పరుచుకున్నప్పుడు ప్రకృతి ఒక అనంత దీపావళిలా కనిపిస్తుంది. అదే నక్షత్ర సమూహం నేలమీదకు దిగివచ్చిందా అన్నట్టు దీపావళి పండుగ రోజు రాత్రి ప్రతి లోగిలీ కాంతులతో కళకళలాడుతుంది. మట్టి ప్రమిదలో చిన్న వత్తి, కొద్దిపాటి నూనె, ఒక అగ్నిశిఖ. భౌతికంగా చూస్తే దీపం నిర్మాణం ఇంతే. కానీ మానవ సంస్కృతిలో దాని స్థానం అపారం. దీపం వెలిగినప్పుడు చీకటి తొలగుతుంది. చీకటి తొలగినప్పుడు వస్తువులు కనిపిస్తాయి. వస్తువులు కనిపించినప్పుడు వాటి స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వెలుగు అనేది కేవలం దృశ్యానికి ఆధారం కాదు, జ్ఞానానికి ఒక ప్రతీక కూడా. అంధకారం నుంచి వెలుగులోకి నడిపించమనే ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే ఆకాంక్ష భౌతిక చీకటి గురించే కాదు, మన లోపల ఉన్న చీకటి గురించి కూడా. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అసత్యం నుంచి సత్యానికి, సంకుచితత్వం నుంచి విశాలదృష్టి వరకు సాగాల్సిన మానవ ప్రయాణానికి సంకేతం.

Diwali... From Darkness to a Ray of Consciousnessదీపావళికి అనేక కథలు

భారతదేశంలో దీపావళికి అనేక కథలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళిని జరుపుకున్నట్లుగా చెబుతారు. దక్షిణ భారతదేశంలోని పలుప్రాంతాల్లో నరకాసుర సంహారానికి సంబంధించిన కథ ప్రాచుర్యంలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో లక్ష్మీపూజ, నూతన వ్యాపార సంవత్సర ప్రారంభంగా దీన్ని భావిస్తారు. జైనుల సంప్రదాయంలో దీపావళి నాడు మహావీరుని నిర్వాణాన్ని స్మరించుకుంటారు. సిక్కు సంప్రదాయంలో బందీ ఛోర్ దివస్ జరుపుకుంటారు. ఆచారాలు వేరైనా వెలుగును శుభానికి, విముక్తికి, విజయానికి ప్రతీకగా భావిస్తూ ఉండటం ఈ వైవిధ్యంలో మనకు కనిపిస్తున్న సాంస్కృతిక సత్యం. ఇవన్నీ భిన్నమైన విశ్వాసాలు కావచ్చు. కానీ పండుగ ఒక్కటే.

ప్రమిద ఒకటే.. పరమార్థాలు అనేకం

తాత్విక విశ్లేషణలో దీపాన్ని మానవ జీవితానికి ప్రతీకగా భావిస్తారు. మట్టిప్రమిదను శరీరంగా, నూనెను జీవశక్తిగా, వత్తిని సాధనగా, జ్యోతిని చైతన్యంగా భావించవచ్చు. ప్రమిద ఒక్కటే ఉన్నంత మాత్రాన వెలుగు రాదు. నూనె, వత్తి, అగ్ని పరస్పరం సహకరించినప్పుడే కాంతి ఉద్భవిస్తుంది. మానవ జీవితమూ అంతే. శరీరానికి శక్తి, మనసుకు సంయమనం, బుద్ధికి వివేకం, జీవితానికి లక్ష్యం తోడైనప్పుడే వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, దీపం తాను వెలుగుతూ చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుతురును అందిస్తుంది. అలా తన వెలుగును ఇతరులకు పంచినంత మాత్రాన అది తన కాంతిని కోల్పోదు. ఒక దీపంతో వంద దీపాలను వెలిగించవచ్చు. దీనినే మనం విద్యకు, విజ్ఞానానికి, మానవీయ విలువలకు అనుసంధానించి చెప్పుకోవచ్చు. విద్య, జ్ఞానం వంటివి పంచినా తగ్గవు. మరింతగా విస్తరిస్తాయి.

సాహిత్య దీపావళి

తెలుగు కవులు దీపాన్ని అలంకార వస్తువుగా మాత్రమే కాక ప్రకృతి సౌందర్యానికి, మానవ స్వభావ పరిశీలనకు, సామాజిక చైతన్యానికి ప్రతీకగా మలిచారు. పోతన భాగవతంలో లోకాలకు అతీతమైన తత్వాన్ని వెలుగుతో పోల్చే పద్యభావాలు కనిపిస్తాయి. భౌతిక ప్రపంచం అంతరించినా నిలిచివుండే శాశ్వత తేజస్సు గురించి ఆయన ఆధ్యాత్మికత సాగుతుంది. ధూర్జటి ప్రకృతినే ఒక మహాదేవాలయంగా, చంద్ర కాంతిని దీపాల సమూహంగా, నక్షత్రాలను పుష్పాలుగా భావించి వాటితో శివారాధన చేస్తాడు. నన్నెచోడుని కవిత్వంలో పూలతో నిండిన వృక్షాలు దీపవృక్షాలుగా దర్శనమిస్తాయి. ప్రకృతిలోని సౌందర్యాన్ని కృత్రిమ దీపాల వెలుగుతో పోలుస్తాడు. తిలక్ కవిత్వంలోని దీపం వెలుగు చీకటిని తొలగించడమే కాదు, చీకటి ఉనికిని కూడా మనకు తెలియజేస్తుంది అనే ఆలోచనకు ద్వారం తెరుస్తుంది. ఇదే భావనలో మానవ జీవితాన్ని గమనిస్తే మనిషిలోని లోపాలను గుర్తించడానికి కూడా వివేకమనే వెలుగు అందరికీ అవసరమని అర్థమవుతుంది. దాశరథి కవిత్వంలో జ్ఞానదీపం సామాజిక చైతన్యానికి సంకేతంగా నిలుస్తుంది. అక్షరజ్ఞానం అందని జీవితాల్లో విద్యావెలుగులు ప్రసరించాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. ఇలా భక్తియుగం నుంచి ఆధునిక యుగం వరకు దీపం తన రూపాన్ని మార్చుకోకుండానే తన అర్థాలను విస్తరించుకుంటూ పోతోంది.

దీపశిఖలో ధ్యానదీప్తి

నిశ్చలంగా వెలిగే దీపశిఖను చూస్తున్నప్పుడు మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. నిరంతరం అనేక విషయాలవైపు పరుగులు తీసే మనసును ఒకే అంశంపై నిలపడానికి దీపజ్యోతి ఉపయోగపడుతుంది. అది ఏకాగ్రతను అందిస్తుంది. యోగ సంప్రదాయంలో ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరించే ప్రత్యేక సాధన ఉంది. అయితే దీపాన్ని తదేకంగా చూడటం వల్లనే అన్ని మానసిక సమస్యలూ తొలగిపోతాయని కాదు. దీపధ్యానంలోని అసలైన సందేశం ఏంటంటే మనసు అనే దీపశిఖ స్థిరంగా ఉండాలంటే ఆలోచనల గాలి తీవ్రత తగ్గాలి అని. దీపం మనిషికి నిశ్చలతను నేర్పే ఒక మౌన గురువన్నమాట.

మట్టిప్రమిదలో శ్రమజ్యోతి

దీపావళి అనగానే మనకు వెలిగే ప్రమిదలు కనిపిస్తాయి. కానీ ఆ ప్రమిదను తయారుచేసిన కుమ్మరి శ్రమ ఎంతమందికి కనిపిస్తుంది? మట్టిని సేకరించడం, దానిని మెత్తగా మలచడం, చక్రంపై ఆకృతి ఇవ్వడం, ఎండబెట్టడం, కాల్చడం. ఇలా అనేక దశలు దాటిన తర్వాతే ఒక చిన్న ప్రమిద మన చేతికి అందుతుంది. ఒక ఇంట్లో వంద దీపాలు వెలిగితే అది ఒక కుటుంబానికి పండుగ. అదే వంద దీపాలను తయారుచేసిన కళాకారుడికి సరైన ప్రతిఫలం లభిస్తే అది అతని కుటుంబానికి జీవనాధారం. స్థానిక కళాకారుల దగ్గర ప్రమిదలు కొనడం, చేతివృత్తులను ప్రోత్సహించడం ఈ పండుగలో ఒక సంప్రదాయం కావాలి. ప్రమిదలో వెలిగే నూనెలో దానిని మలిచిన కార్మికుడి శ్రమ కూడా చూడగలగాలి.

పర్యావరణ హిత కాంతులు

ఇప్పుడు అందరం తెలుసుకోవలసింది పండుగను ఎలా జరుపుకోవాలన్నది కాదు. ఆనందాన్ని పంచుకుంటూనే ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్నది. దీపావళి సమయంలో బాణసంచా, వాహన ఉద్గారాలు, పంటవ్యర్థాల దహనం, వాతావరణ పరిస్థితులు కలిసి వాయు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా బాణసంచా వల్ల వెలువడే సూక్ష్మకణాలు, రసాయన కాలుష్య కారకాల గురించి అవగాహన కల్పిస్తోంది. దీపావళి పేరుతో గాలిని కలుషితం చేయడం, శబ్దాలతో పసిపిల్లలను, వృద్ధులను, పక్షులను, జంతువులను ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదు. మట్టిదీపాలు, పునర్వినియోగ అలంకరణలు, పరిమిత విద్యుత్ వినియోగం, సురక్షితమైన వేడుకలు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాని, ప్రకృతిని చీకటిలోకి నెట్టి మన ఇళ్లను వెలిగించుకోవడం దీపావళి అవ్వదు.

Diwali... From Darkness to a Ray of Consciousnessవెలుగులకు అందని బతుకులు

దీపావళి రోజు రాత్రి భవంతులన్నీ విద్యుఋద్దీపాలతో మెరిసిపోతాయి. కానీ కొన్ని నిరుపేద కుటుంబాలు పండుగ చేసుకోలేకపోతుంటాయి. అందుకే పండుగ సందర్భంగా అలాంటి నిరుపేద పిల్లలకు పుస్తకాలు అందించడం, మిఠాయిలు పంచటం, కొత్త బట్టలు కొనివ్వడం, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులను పలకరించడం, అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా బంధాలను పునరుద్ధరించుకోవాలి. ఇవన్నీ దీపావళికి అవలంబించాల్సిన సామాజిక బాధ్యతలు. సంపదను సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని న్యాయంగా వినియోగించడం, సమాజహితానికి కొంత పంచడం అంతే ముఖ్యమని గుర్తించాలి. సంపద ఇంటిని సంపన్నం చేస్తుంది. సహృదయం సమాజాన్ని సుసంపన్నం చేస్తుంది. దీపావళి మనకు మరొక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. ఇంట్లోని దుమ్మును తొలగించినట్టే మనసులోని అసూయను, అహంకారాన్ని, ద్వేషాన్ని తొలగించుకోవాలి. ఇంటిముందు ముగ్గులు వేసినట్లే జీవితంలో సత్సంబంధాలకు స్థానం కల్పించాలి. గుమ్మానికి దీపాలు పెట్టినట్లే మన ఆలోచనలలో వివేకాన్ని అలవరుచుకోవాలి. మనిషిలోని అజ్ఞానం తొలగితే అది జ్ఞానదీపం, ద్వేషం తొలగితే ప్రేమదీపం, స్వార్థం తొలగితే సేవాదీపం, భయం తొలగితే ధైర్యదీపం, నిరాశ తొలగితే ఆశాదీపం వెలిగినట్లు. ఇవన్నీ కలిసినప్పుడే వ్యక్తిత్వం ఒక అఖండ జ్యోతిగా ప్రకాశిస్తుంది.

ఇంటి గుమ్మంలో వెలిగేది పండుగ దీపం.

మనసులో వెలిగేది జ్ఞానదీపం.

మరొకరి జీవితంలో వెలిగించేది మానవత్వ దీపం.

ఈ మూడు దీపాలు ఒకటైనప్పుడే దీపావళి అనేది వేడుకల వైభవాన్ని దాటి మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుంది.


విశ్వైక, 9550183143


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్