Magazines

ఇందూరు జైలు సందర్శనానుభవం

1 గంట క్రితం

11
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 4 నిమిషాల చదవడం

నైజాం నిరంకుశ పాలనపై అక్షరాన్నే ఆయుధంగా మలచి, తెలంగాణ ముద్దుబిడ్డలుగా నిలిచిన మహనీయులు వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ సాంస్కృతిక, పోరాట చరిత్రలో వీరిద్దరిదీ విడదీయరాని అనుబంధం. ఒకే ఆశయం, ఒకే పోరాట మార్గం వైపు నడిచిన ఈ అమరమూర్తుల జ్ఞాపకాలు ఇందూరు (నిజామాబాద్) జైలు మట్టిలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నేడు తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. అలాగే ఈనెల 5వ తేదీన మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి. ఈ ఇద్దరు మహనీయులు గడిపిన ఇందూరు జైలును నేను ఇటీవల సందర్శించాను. ఆ విషయాలను ‘సోపతి’ పాఠకులతో పంచుకుంటూ...

ఆఫీసు పని నిమిత్తం మా టీమ్‌తో కలిసి నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన కవులను బంధించిన ఇందూరు జైలు, మేము ఉన్న ప్రదేశానికి అత్యంత సమీపంలోనే ఉందనే విషయం సోదరుడు శరత్ ద్వారా తెలిసింది. దాంతో ఆ చారిత్రక ప్రాంతాన్ని చూడాలని నా మనసు తహతహలాడింది. బిజీగా ఉన్న మా వర్క్ షెడ్యూల్ వల్ల అది సాధ్యపడుతుందో లేదోనని సందేహం ఉన్నప్పటికీ, మూడో రోజు ఉదయమే వెళ్లి రావాలని ప్రణాళిక వేసుకున్నాం.

An Experience of Visiting Induru Jailకానీ అనుకోకుండా వర్షం రూపంలో ప్రకృతి ప్రతికూలత చూపించింది. ఏకధాటిగా కురిసిన వానకు మా ఉత్సాహమంతా నీరుగారిపోయి నిరాశగా ఆఫీసుకే వెళ్లాం. నా ముఖంలో ఆ నిరాశను గ్రహించిన మా టీమ్, ‘అన్నా, మీరు వెళ్లి రండి. వచ్చేలోపు మాకిచ్చిన పని పూర్తి చేస్తాం’ అని కొండంత భరోసానిచ్చారు. దాంతో వాన తగ్గగానే మా స్టాఫ్ రిపోర్టర్‌తో కలిసి కూతవేటు దూరంలో ఉన్న ఇందూరు జైలు ప్రాంగణానికి బయలుదేరా.

ప్రకృతి అందాలు – ప్రాచీన కోట రక్షణ

కాలినడకన గుట్ట పైకి చేరుకుంటున్న కొద్దీ ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. 10వ శతాబ్దానికి చెందిన రాష్ట్రీయకూటులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రాతి గుట్టలు, రాతి ప్రాకారాలు, కోట బురుజులతో శత్రువులకు అభేద్యమైన భద్రతా వలయంగా నిలిచింది. గుట్టపై నుంచి చూస్తే నిజామాబాద్ నగర దృశ్యాలు, చుట్టూ పరుచుకున్న పచ్చని చెట్లు, వ్యవసాయ భూములు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. జైలు ప్రాంగణానికి సమీపంలోనే సుప్రసిద్ధమైన రామాలయంతో పాటు, ప్రవేశ ద్వారం వద్ద నిజాం కాలం నాటి పాత మసీదు, దర్గా కొలువుదీరి భిన్న సంస్కృతుల కలయికగా నిలిచాయి. నిజాం కాలం నుండి 2009 వరకు జైలు అక్కడే కొనసాగింది. ఆ తర్వాత ఖైదీలను నూతన భవనానికి తరలించారు.

చారిత్రక పరిసరాల్లో గగుర్పాటు

బారీ ఇనుప తలుపులు దాటి లోపలికి అడుగుపెట్టిన క్షణం నా గుండెల్లో ఒక రకమైన నిశ్శబ్దంతో కూడిన గగుర్పాటు ఆవరించింది. బయట శబ్దాలు మాయమై, 1940ల నాటి తెలంగాణ రజాకార్ల నిరంకుశత్వం, దానికి ఎదురొడ్డి నిలిచిన అక్షర యోధుల గంభీర ముఖాలు కళ్లముందు మెదిలాయి. కాలం గడిచిపోయినా ఆ రాతి బ్యారక్‌లు, చల్లని ప్రహరీ గోడలు నేటికీ ఆనాటి స్వేచ్ఛా పోరాట గాథలను మౌనంగా గుసగుసలాడుతున్నట్లే అనిపించాయి. నిజాం నిరంకుశత్వం ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న ఆ రోజుల్లో ఇందూరు జైలు ఒక నిర్బంధ కేంద్రంగా మాత్రమే కాక, పోరాట యోధులకు ఒక చైతన్య పాఠశాలగా మారిందని చదువుకున్న గుర్తులు, ప్రముఖుల ప్రసంగాల్లో విన్న విషయాలు ఒక్కసారిగా చెవుల్లో మారుమ్రోగాయి. అప్పుడు అర్థమైంది ‘చరిత్రను చదవడం వేరు, ఆ చరిత్ర జరిగిన ప్రదేశంలో నిలబడటం వేరు’ అని.

An Experience of Visiting Induru Jailజైలు ఆవరణలోని ఒక నిర్దిష్ట గోడ వద్ద నిలబడినప్పుడు నా ఒళ్లు పులకరించింది. అగ్నిశిఖలాంటి పద్యాలను ప్రసవించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జిస్తూ, బొగ్గు ముక్కతో ఈ గోడల మీదనే పద్యాలు చెక్కిన దృశ్యం కళ్లముందు మెదిలింది. కాగితం, కలం లేని నిర్బంధంలో ఆ రాతి గోడలే ఆయనకు కాగితాలయ్యాయి. ఆ చీకటి గదులే ఆయన కావ్య రచనకు రంగస్థలమయ్యాయి. ప్రజా విముక్తి కోసం ఆయన గుండెల్లో రగిలిన ఆక్రోశం ఇందూరు జైలు గోడల పైనుంచి నలుదిక్కులా వ్యాపించి సమరశంఖమై మోగింది. ఆ రాతి గోడలపై చేయి వేసినప్పుడు చల్లని రాళ్లు తాకాయి గానీ, దాశరథి రాసిన అగ్ని పద్యాల వేడి నా వేళ్ల చివరల్లో ప్రసరించినట్లయింది. ఇప్పుడు వాటి స్థానంలో ఆయన రాతలను చిత్రపటాలుగా ఏర్పాటు చేశారు. ఆ బ్యారక్‌లో వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య నిలువెత్తు విగ్రహాలను చూస్తుంటే వారే స్వయంగా అక్కడ ఉన్నారా అన్న అనుభూతి కలిగింది. వారికి కాపలా ఉన్న పోలీసుల విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అవి ఆ నాటి దృశ్యాలను కండ్లముందు ఉంచుతున్నాయి.

అక్షర చైతన్యం – ‘జైలు లోపల’ స్మృతులు

అక్కడే ఉన్న పెద్ద బ్యారక్‌లో కలయదిరిగితే తెలంగాణ తొలి ప్రజా నవలాకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్మృతులు మనసును తాకాయి. ప్రశాంతంగా ఉన్న ఆ నిశ్శబ్దంలోనూ ఆనాడు ఖైదీల చేతులకు, కాళ్లకు కట్టిన గోలుసుల శబ్దాలు, వట్టికోట గొంతుక నుండి అక్షరాలు ప్రతిధ్వనించినట్టు అనిపించాయి. ఇందూరు జైలు చీకటి గదుల్లోనే తోటి ఖైదీలకు అక్షరాలు దిద్దిస్తూ నిరక్షరాస్యతా నిర్మూలనకు శ్రీకారం చుట్టిన జ్ఞానకేంద్రం ఆయన. అణచివేతకు గురవుతున్న ప్రజల ఆక్రందనలను ‘ప్రజల మనిషి’, ‘గంగు’ వంటి నవలల ద్వారా అక్షరబద్ధం చేయడానికి నాంది పడింది ఈ జైలు పరిసరాల్లోనే. ఈ అనుభవాలనే ఆయన ‘జైలు లోపల’ కథలుగా మన ముందుకు తెచ్చారు. ఆ కథల్లో నిజాం జైలు కఠిన నిబంధనలు, అధికారుల అమానుష వైఖరి, సాధారణ ఖైదీల సామాజిక-ఆర్థిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు వివరించారు.

ఇందూరు జైలు కేవలం ఒక శిక్షాస్మృతి కాదు, అది ఆ ఇద్దరు వీరుల స్నేహబంధానికి, త్యాగానికి మౌన సాక్షి. ఒకరు కవిత్వంతో ప్రజలను చైతన్యపరిస్తే, మరొకరు వచనంతో సామాజిక స్పృహను రగిలించారు. వీరిద్దరూ జైలు అనుభవాలను స్వీకరించి తమ రచనలతో తెలంగాణ సమాజానికి అమూల్యమైన చేదోడును అందించారు. జైలు నిబంధనలు వారి దేహాలను మాత్రమే బంధించగలిగాయి కానీ, వారిలోని స్వేచ్ఛాకాంక్షను, అక్షర చైతన్యాన్ని అణచివేయలేకపోయాయి. నేడు మనం అనుభవిస్తున్న ఈ అక్షర స్వేచ్ఛ ఊరికే రాలేదని, ఆ చీకటి గదుల్లో వారు చేసిన అక్షర స్వేదం, త్యాగాల పునాదులపై నిర్మితమైందని భావించినప్పుడు గుండె గౌరవంతో బరువెక్కింది. ఆ చారిత్రక ప్రదేశం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నా మనసులో ఆ జ్ఞాపకాలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి.

అనంతోజు మోహన్‌‌కృష్ణ, 88977 65417


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్