Magazines

అమ్మ మాటే వినాలి..

1 గంట క్రితం

You must listen to what Mom says.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం


రామాపురం ఊరిమధ్యలో కానుగ చెట్టు మీద ఒక కోతి, దానిపిల్ల నివసిస్తూ ఉండేవి. ప్రతిరోజూ పెద్ద కోతి చు ట్టూ పక్కలకు వెళ్ళి పండ్లో, ఆహారమో తెచ్చి పిల్లకోతికి పెట్టేది. కాస్త పెద్దైయ్యాక పిల్లకోతిని ఒంటరిగా పంపించి, దాని ఆహారం అది వెతుక్కునేలా చేయాలనీ ఒకరోజు ఉదయం ‘‘చిన్నా..! నువ్వు పెద్దదానివి అవుతున్నావు. ఇక నుంచి నీ ఆహారం నువ్వు సంపాదించుకోవాలి. ఈ రోజు నేను తూర్పు వైపుకి వెళతాను. నువ్వు పడమర వైపు అర మైలు దూరం వెళ్ళా వంటే అక్కడ పెద్ద జామచెట్టు ఉంది. ఇప్పుడే వెళితే దోరగా పండిన కాయలు దొరుకుతాయి. ఆలస్యం చేస్తే, పెద్ద కోతులు, పక్షులు అన్నీ వాటిని తినేస్తాయి. త్వరగా వెళ్ళి జామకాయలు తెంపుకుని కడుపునిండా తిను. మిగిలితే నా కోసం రెండు జామపండ్లు తీసుకురా. నేను వెళుతున్నాను’’ అని పెద్ద కోతి చెట్టు మీదనుంచి కిందకి దూకి, వెళ్ళిపోయింది.

పిల్లకోతి కాసేపు అటూ ఇటూ చూసి, మెల్లగా చెట్టు దిగబోయింది. చెట్టు కింద ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్నారు. ఒకాయన ‘‘ఇక బయలు దేరుదామా’’ అన్నాడు. అతని భార్య ‘‘సరే’’ అంది. ఇద్దరూ పైకి లేచి నిలబడ్డారు. ఇంతలో ఆమె ‘‘హాచ్ హాచ్’’ మని తుమ్మింది.

వెంటనే అతను ‘‘అరెరే.. మంచి పని కోసం వెళుతుంటే తుమ్మావు. ఇప్పుడు వెళితే పని జరగదు. కాసేపు కూర్చుని వెళదాము’’ అన్నాడు. ఇద్దరూ చెట్టు కిందే కూర్చున్నారు. చెట్టు నుంచి దిగబోయిన కోతిపిల్ల ‘అరే. నేను కూడా మొదటిసారి ఆహారం సంపాదించుకోవడం కోసం వెళుతున్నాను కదా. ఇప్పుడే ఈమె తుమ్మింది. అతను చెప్పినట్లు ఇప్పుడు బయలు దేరితే నా పని కూడా కా దేమో’ అనుకోని మళ్ళీ చెట్టు కొమ్మపైనే కూర్చుంది.

మెల్లగా దానికి నిద్రవచ్చి కళ్ళు మూసుకుంది. అర్ధగంట గడిచిపోయింది. హఠాత్తుగా మెలకువ వచ్చి, కిందకి చూసింది. చెట్టు కింద ఉన్న వాళ్ళు వెళ్లిపోయారు. కంగారుగా చెట్టు దిగి, పడమరవైపు వెళ్ళింది.

పిల్లకోతి వెళ్ళే సరికే జామచెట్టు మీద పెద్దకోతులు పండ్లను తెంపుకొని తింటున్నాయి. పక్షులు కూడా పండ్లన్ని తినీ కొరికేస్తున్నాయి. అక్కడే ఉన్న ఉడుత కోతిపిల్లను చూసి ‘‘ఈ ప్రాంతానికి నువ్వు కొత్తదానిలా కనబడుతున్నావు. ఈ చెట్టు మీది పండ్లకోసం పొద్దున్నే రావాలి. లేకుంటే పండ్లు మనకి దొరకవు. నేను కూడా ఈరోజు ఆలస్యంగా వచ్చాను. దగ్గరికి పోతే పెద్ద కోతులు కరుస్తాయి. ఈరోజుకి ఇక నాకు ఇక్కడ పండ్లు దొరకవు’’ అంటూ విచారంగా వెళ్ళిపోయింది. ఒకపక్క ఆకలి, మరోపక్క జామకా యలు దొరకలేదని బ ధతో మెల్లగా కానుగ చెట్టు దగ్గరకు వచ్చింది పిల్ల కోతి.

ఖాళీ చేతులతో వచ్చిన పిల్ల కోతిని చూసి, ‘‘ఏమైంది’’ అని అడిగింది పెద్ద కోతి. జరిగిందంతా చెప్పింది పిల్ల కోతి. అప్పుడు ‘‘వాళ్ళు మనుషులు. చాలా రకాల మూఢనమ్మకాలతో తమ పనులు చెడగొట్టుకుంటారు. నష్టపోయాక విచారిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్షం ఈరోజు నీకు జరిగినదే. ఎవరో తుమ్మారనో, పిల్లి ఎదు రొచ్చిందనో మనం ఆగిపోకూడదు. అలా చేస్తే సమయం మించిపోయి, చాలా నష్టం వస్తుంది. ఇక నుంచి ఎవరిమాటలు వినకు. నేను చెప్పినట్లు చేయి. సరేనా’’ అంటూ పెద్ద కోతి తను తెచ్చిన అరిటి పండ్లు రెండు పిల్లకోతికి ఇచ్చింది. ‘‘సరే అమ్మా.. ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను’’ అని పిల్లకోతి ఆనందంగా అరటిపండ్లు తినసాగింది.

నీతి: మూఢనమ్మకాలు పాటిస్తే నష్టపోతాము.

- రోహిణి వంజారి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్