రామారావు ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తాం
హత్యలు, దాడులతో ఎర్రజెండాను అణచివేయలేరు
నిజమైన నేరస్తులను పట్టుకోవాలి : ప్రథమ వర్థంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-చింతకాని
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సామినేని రామారావుది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఇలాంటి దారుణాలతో ఎర్రజెండాను అణచివేయ లేరని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని నినదించారు. ఖమ్మం జిల్లా చింతకాని పాతర్లపాడు గ్రామంలో శనివారం సామినేని రామారావు ప్రథమ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జాన్‌వెస్లీ పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల విముక్తి, దోపిడీ వ్యవస్థ నిర్మూలన, సమసమాజ స్థాపనే కమ్యూనిస్టు ఉద్యమ లక్ష్యమన్నారు. రామారావు పేదలు, రైతులు, శ్రామిక వర్గాల పక్షాన నిరంతరం పోరాడారని కొనియాడారు. పేద-ధనిక అసమానతలు, కుల వివక్ష, స్త్రీ-పురుష అసమానతలు లేని సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోందన్నారు. సీపీఐ(ఎం) ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా అధికారం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇతర ఏ పార్టీ అధికారంలో ఉన్నా పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ధైర్యం కమ్యూనిస్టు నాయకత్వానికి ఒక్కదానికే ఉందని చెప్పారు. ఆ పోరాట యోధుడే సామినేని రామా రావు అని, ప్రజల సమస్యలపై రాజీ పడకుండా ఉద్యమాలు నిర్వహించినందుకే ఆయన ప్రజల్లో విశేష గుర్తింపు పొందారని తెలిపారు. కమ్యూని స్టు ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో గతంలో అనేక మంది ఎర్రజెండా నాయకులను హత్య చేశారని గుర్తు చేశారు. అయినా ఉద్యమం ఎక్కడా ఆగలేదని జాన్ వెస్లీ స్పష్టం చేశారు. ఒక్క నాయకుడిని హత్య చేస్తే ఎర్రజెండా ఆగిపోతుం దని ఎవరైనా భావిస్తే అది పొరపాటేనని, అనేక మంది తమ రక్తాన్ని చిందించి ఉద్యమాన్ని నిలబెట్టారని వివరించారు. రామారావు హత్యతో ఈ ప్రాంతంలో ఎర్రజెండా ఉద్యమాన్ని బలహీన పరచొచ్చని కొందరు భావించి ఉండొచ్చని, కానీ హత్యలు, దాడులు, బెదిరింపులతో కమ్యూనిస్టు పార్టీ ప్రాభల్యాన్ని తగ్గించలేరని అన్నారు. పేద ప్రజల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమయ్యే కార్యకర్తలే కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తారని చెప్పారు.
“నరికిన కొద్దీ మొలకెత్తుతాం.. పోరాటాలతో చరిత్రను తిరగరాస్తాం” అనే స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు సాగుతుందని జాన్ వెస్లీ స్పష్టం చేశారు.
ప్రభుత్వం అండదండలు, అధికార బలం ఉన్నాయనే ధీమాతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదన్నారు. సామినేని రామారావు హత్య జరిగి సంవత్సరం పూర్తవుతోందని, కేసులో నిజమైన కుట్రదారులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. హత్య కేసుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయని చెబుతున్న అంశాలపై స్పష్టమైన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
రామారావు కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని పేర్కొంటూ, హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, నిజమైన నిందితులు, కుట్రదారులెవరో సమగ్రంగా దర్యాప్తు చేసి బయటపెట్టాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బండి రమేష్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాచర్ల భారతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి.రమణ, కల్యాణం వెంకటేశ్వర్లు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్‌రావు, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ పాల్గొన్నారు.







కామెంట్లు (0)