Magazines

నా రక్తం సిగ్గు కాదు (కట్టడుల ధర్మానికి ఆవల)

1 గంట క్రితం

My blood is not shame (Beyond the dictates of established norms)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రతి నెల నా శరీరం

రక్తంతో ఒక సత్యం రాస్తుంది

అది నొప్పి కాదు

అది ప్రకృతి ప్రకటించిన సత్యం

జీవం అక్కడ్నుంచే మొదలవుతుంది

కానీ కట్టడుల ధర్మం దాన్ని

ఒకే పదంతో నిర్వచిస్తోంది అపవిత్రం

నా కడుపులో నొప్పి మెలికలు తిరిగితే

నా శరీరం విశ్రాంతి కోరుతుంది

కానీ వాళ్లకు అది నొప్పి కాదు

ఒక కారణం, నన్ను వెలిగా పెట్టడానికి

తాకొద్దు వెలిగా ఉండు అది ముట్టు

అవి మాటలు కాదు కట్టడుల ధర్మపు ఆజ్ఞలు

అవి నా శరీరాన్ని నియంత్రించే

అజ్ఞాత గొలుసులు

అక్కడ వెలిగా పడుకోబెట్టిన ఆ రాత్రులు

నా ఒంటరితనం కాదు

అది నన్ను న్యూనపరచే

నిశ్శబ్ద క్రూర శిక్ష

నేను ఏ తప్పూ చేయలేదు కానీ,

నన్ను నేరస్తురాలిలా ఖైదు చేశారు

శుభకార్యాల్లో నన్ను తలుపు దగ్గరే

ఆపినప్పుడు అర్థమైంది...

అది పూజల గురించి కాదు

పవిత్రత గురించీ కాదు

కట్టడుల ధర్మం...

స్త్రీని ఎక్కడ నిలబెట్టాలో

నిర్ణయించే హక్కు గురించి

వాళ్లు నా శరీరాన్ని

అపవిత్రం అన్నారు

అదే శరీరం వాళ్లకు

జన్మనిచ్చిందని మర్చిపోయారు

అది వాళ్ల సౌకర్యానికి సరిపడే మరపు

కట్టడుల ధర్మం తీర్పు

ఆ ట్రామా కేవలం ఆ మూడు రోజులు కాదు

ప్రతి నెల నాలో మళ్లీ మళ్లీ

ఒక సందేహాన్ని నాటింది

నా శరీరమే తప్పా

లేక నన్ను చూసే చూపులే తప్పా

నేనే తప్పా లేక నా శరీరాన్ని

నియంత్రించాలనుకునే

కట్టడుల ధర్మమే తప్పా

ఆ సందేహమే కట్టడుల ధర్మం

నన్ను ఉంచిన అదృశ్య బోనుని

నాకు కనపడేట్టు చేసింది

ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను

నా శరీరం పూజలకోసం కాదు

ఎవరైనా నన్ను

నియంత్రించడం కోసమూ కాదు

ఈ రక్తం సిగ్గు కాదు

ఈ నొప్పి బలహీనత కాదు

ఇది సృష్టి సామర్థ్యం

ఇది జీవాన్ని మోసే శక్తి

నన్ను గదుల్లో బంధించిన కట్టడుల ధర్మం

ఇప్పుడైతే నా ముందు నిలబడలేదు

ఎందుకంటే నేను దాన్ని పాటించకపోతే

దానికి అర్థమే ఉండదు

ఇప్పుడు ఎవరైనా వెలిగా ఉండు అంటే

నేను వెనక్కి వెళ్లను, అడుగుతాను

నాది ఇక మౌనం కాదు

నా శరీరం గురించి నేనే నిర్ణయించుకునే

ఒక సాధికార స్వరం కట్టడుల ధర్మంపై

ధిక్కార శంఖారావం

ఇది ఇప్పుడు ముట్టు కాదు

కట్టడుల ధర్మం విధించిన వెలిగట్టు కాదు

నేనెక్కిన పైమెట్టు

ఇది తిరుగుబాటు కాదు

ఇది ఇప్పుడు నా స్వాధీనం


- ఖదిజ్ఞాసి రజని, 9848030089.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్