Magazines

‘సామినేని’ అసలైన హంతకులను అరెస్టు చేయాలి

1 గంట క్రితం

Samineni
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 3 నిమిషాల చదవడం

‘సిట్‌’ ఏర్పాటుపై ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి

ఖమ్మం అఖిలపక్ష సమావేశంలో తీర్మానం

దోషులను రక్షించే పనిలో డిప్యూటీ సీఎం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, జిల్లా కార్యదర్శి నున్నా


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు, పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు అసలైన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మంలోని సుందరయ్య భవన్‌‌లో శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2025 అక్టోబర్ 31న ఉదయం 5 గంటల సమయంలో సామినేని రామారావును ఆయన ఇంటి వద్దే దారుణంగా హత్య చేశారని గుర్తుచేశారు. అప్పటి నుంచి హంతకులను పట్టుకోవటంలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, నిందితులను రక్షించే వైఖరితో ఉన్నారని విమర్శించారు. ఈ నెల 29న ఖమ్మం సీపీ ప్రెస్‌మీట్ పెట్టి హత్యతో సంబంధం లేని వేరే నలుగురిని నిందితులుగా చూపెడుతూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

సీపీ వ్యవహారశైలిని గమనించే నేర నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని, హోంమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి కూడా సిట్ ఏర్పాటుకు అంగీకరించారని గుర్తుచేశారు. ​డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుపడటం వల్లే సిట్ ఏర్పాటు కాలేదని ఆరోపించారు. సాక్ష్యాధారాలు పక్కన పెట్టి కేసును పక్కదోవ పట్టించే సీపీ వైఖరిని అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ​రామారావుకి ఏ విధమైన ఆర్థిక, ఆస్తుల వివాదాలు లేవని, 40 ఏండ్లుగా కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆయనదని తెలిపారు. అందుకే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా రామారావు హత్యపై సమగ్ర విచారణకు సిట్‌ ఏర్పాటు చేసి, అసలైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మా నాన్నకు ​ఏ వివాదాలు ఉన్నాయో తేల్చండి : పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు రామారావు కుమారుడు విజయ్ సవాల్

సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తును పోలీసులు పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని ఆయన కుమారుడు సామినేని విజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య వెనుక ఆర్థిక, రాజకీయ, రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయంటూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్, పలువురు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని ఖండించారు. ​తమ కుటుంబానికి ఎక్కడ, ఏ ఆస్తులపై వివాదాలున్నాయో, ఏ సర్వే నెంబర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారో నిరూపించాలని సవాల్ విసిరారు. మరణించిన వ్యక్తి మంచి పేరును కూడా చెడగొట్టేలా అధికారికంగా ప్రకటనలు చేయడం ద్వారా తమ కుటుంబానికి తీరని మానసిక క్షోభ కలిగిస్తున్నారని వాపోయారు. తన తల్లి ప్రతిరోజూ నిద్రలేకుండా తీవ్ర ఆందోళనలో గడుపుతున్నారని తెలిపారు.


పోలీసుల విచారణ తీరుపై తమకు నమ్మకం సడలుతోందని, ఈ వ్యవహారంపై పార్టీ నాయకులతో, లీగల్ నిపుణులతో చర్చించి న్యాయపోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శింగు నరసింహారావు, లక్ష్మీనారాయణ, సీపీఐ(ఎం) నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేష్, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, ​మాచర్ల భారతి, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, బండారు రమేష్, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, మడిపల్లి గోపాల్ రావు, మెరుగు రమణ, పిన్నింటి రమ్య, కె.దేవేంద్ర, లక్ష్మీనారాయణ, ​అరుణోదయ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మోహన్, తదితరులతో పాటు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య, ​న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు కందగట్ల సురేందర్, ​న్యూ డెమోక్రసీ డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్