నిషేధం విధించిన సువేందు సర్కార్.. టీచర్స్ సంఘాలు, రాజకీయ పార్టీల ఆగ్రహం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన పాఠశాల ఉపాధ్యాయులు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గనకుండా సువేందు ప్రభుత్వం విధించిన నిషేధం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, పరిణామాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర సచివాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం సువేందు విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఆంక్షలు కేవలం భవిష్యత్తులో నియమితులయ్యే ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని, ఇప్పటికే విధుల్లో ఉన్న వారికి కాదని ఆయన చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నియామక ప్రక్రియలో చేర్చామని తెలిపారు.
రాజీనామా చేశాకే రాజకీయాల్లోకి రండి
ఇప్పటికే రాజకీయాలతో సంబంధం ఉన్న ఉపాధ్యాయుల హక్కులను తాము హరించడం లేదని, అయితే భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా నియమితులయ్యే వారు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గనకూడదని సువేందు స్పష్టం చేశారు. ఉత్తర బెంగాల్‌లోని ఓ పాఠశాలలో గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన రాష్ట్ర పాఠశాఖ విద్యా శాఖ మంత్రి దీపక్ బర్మన్ ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకునే ఉపాధ్యాయులు తమ వృత్తిని విడనాడాల్సి ఉంటుందని చెప్పారు. 'ఉపాధ్యాయులు రాజకీయాల్లో పాల్గనకూడదని కాదు. కానీ వారు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలని నిర్ణయించుకుంటే మాత్రం ఇతర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. ఈ తరహా విధానం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలులో ఉంది' అని బర్మన్ వివరించారు.
రాజకీయాల్లో ఉంటే బాధ్యతలను విస్మరిస్తారా ?
పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయులు, న్యాయవాదులు రాజకీయాల్లో పాల్గనడం సర్వసాధారణమే. సీపీఐ (ఎం), తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు చెందిన ఉపాధ్యాయులు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో చురుకుగా పాల్గంటున్నారు. కాగా సువేందు ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వామపక్షాల మద్దతు ఉన్న ఆల్ బెంగాల్ టీచర్స్ అసోసియేషన్ (ఏబీటీఏ) ప్రధాన కార్యదర్శి సుజిత్ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటనలో స్పష్టత లోపించిందని అన్నారు. రాజకీయాల్లో పాల్గన్నంత మాత్రాన ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలను ఎలా విధిస్తుందని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయుల నిరసన హక్కును ప్రభావితం చేస్తుందని శిక్షనురాగి ఐక్య మంచ్ ప్రధాన కార్యదర్శి కింకర్ అధికారి విమర్శించారు.
ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యా విధానం, వృత్తిపరమైన ఆందోళనలు, చట్టబద్ధ డిమాండ్లపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తే దానిని రాజకీయ కార్యకలాపంగా పరిగణిస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలను చూపుతూ ఆంక్షలు విధించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని బెంగాల్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వపన్ మండల్ ప్రశ్నించారు. బెంగాల్ ఉపాధ్యాయులతో సమానమైన ఉద్యోగ హోదాను ఆయా రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అనుభవించనంత కాలం ఇలాంటి పోలిక తగదని హితవు పలికారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇప్పటికే రాజకీయ భాగస్వామ్యంపై ఆంక్షలను ఎదుర్కొంటున్నారని టీచర్స్ అసోసియేషన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ స్కూల్, హరే స్కూల్ వంటి సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారని వారు గుర్తు చేశారు.
ఇవేనా ప్రభుత్వ ప్రాధాన్యతలు ?
ఉపాధ్యాయ సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా సువేందు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాయి. ఈ చర్యను ఉపాధ్యాయుల ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించాయి. దీనిని న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రకటించాయి. సీపీఐ (ఎం) నేత సుజన్ చక్రవర్తి ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించే కంటే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పైన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి సారించాలని హితవు పలికారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1గా ఉండాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యా బోధనకు ఉపాధ్యాయులను పరిమితం చేయాల్సిన ప్రభుత్వం వారిని సర్, సెన్సస్ పనుల కోసం ఉపయోగించుకుంటోందని, ముందుగా ఈ అంశాలపై దృష్టి సారించాలని సుజన్ చక్రవర్తి సూచించారు.





కామెంట్‌లు (0)