పార్టీకి, పత్రికకు తీరని లోటు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నివాళులర్పించిన సీజీఎం ప్రభాకర్, సిబ్బంది, తోటి జర్నలిస్టు మిత్రులు
స్వగ్రామం నోములలో అంత్యక్రియలు.. పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నవ తెలంగాణ విలేకరి, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి చెందడం పార్టీకి, పత్రికకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆయన మృతి పట్ల పార్టీ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జగన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి మరోసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. శనివారం మంచాల మండలం నోముల గ్రామంలో జగన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాన్‌వెస్లీ, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్ హాజరై జగన్ మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామెల్, మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్యతో పాటు పార్టీ జిల్లా, మండల నాయకులు, పత్రిక రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, సిబ్బంది, టీడబ్లూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు,
వివిధ పార్టీల నాయకులు, తోటి జర్నలిస్టులు పెద్దసంఖ్యలో హాజరై నివాళి అర్పించారు. పీఎన్‌ఎం సభ్యులు జగన్‌పై పాటలు పాడుతూ ఆయనను స్మరించుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ పల్లాటి జగన్ చిన్నతనం నుంచే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఎర్రజెండా పోరాటాలకు ఆకర్షితుడై గ్రామ పార్టీ శాఖ కార్యదర్శిగా, మండల పార్టీ సభ్యునిగా కొనసాగినట్టు చెప్పారు. అలాగే నవతెలంగాణ పత్రికలో విలేకరిగా విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేశారన్నారు. అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కథనాలు రాశారని గుర్తు చేశారు. చనిపోయే ముందు రోజు కూడా తమతోపాటే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడని చెప్పారు. పార్టీ నాయకులు పాషా, నరహరిల స్ఫూర్తితో పార్టీలో క్రమశిక్షణ గల వ్యక్తిగా కమిట్మెంట్ తో పనిచేశారని అన్నారు. జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
జగన్ మృతి నవతెలంగాణకు లోటు : సీజీఎం ప్రభాకర్
విలేకరి జగన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం నవతెలంగాణ పత్రికకు తీవ్ర నష్టమని నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ ఆవేదనను వ్యక్తం చేశారు. జగన్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్ విలేకరిగా నిబద్ధతతో పత్రిక నియమాలకు అనుగుణంగా పనిచేశాడని కొనియాడారు. నవతెలంగాణలో జగన్ క్రమశిక్షణ గల విలేకరిగా పనిచేస్తూ పత్రికకు సేవలందించడం హర్షనీయమన్నారు. ఆయన మృతి భార్యకు, పిల్లలకు తీరని లోటని తెలిపారు. మృతుడి కుటుంబానికి నవతెలంగాణ దినపత్రిక అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, డి.జగదీష్, కందుకూరి జగన్, డి.రామచందర్, పార్టీ మండల కార్యదర్శులు రావుల జంగయ్య, ఆలంపల్లి నరసింహ, బుగ్గ రాములు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసుందర్, పి.అంజయ్య, జగన్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ నివాళి
టీడబ్ల్యూజేఎఫ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ మంచాల రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటులో మృతి చెందడం పట్ల హెచ్‌యూజే, టీడబ్య్లూజేఎఫ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ఉపాధ్యక్షులు గుడిగె రఘు, రాజశేఖర్, కార్యదర్శి జగదీశ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, నాయకులు అజయ్ జగన్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదే విధంగా జగన్ మృతి పట్ల టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య, హెచ్‌యూజే ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.





కామెంట్‌లు (0)