కేతిగాడు : అరె జుట్టుపోలుగా (అజ్ఞేనేష్‌గా) నీవా ఛీప్ ఎన్నికల కమిషనర్ కుర్చీ దిగిపోరా.. దేశం అంతా గగ్గోలు పెడ్తుంటే నీకు సిగ్గూ ఎగ్గూ లేదేందిరా... ఇంకొకడైతే ఇప్పటికే తల నేలకొట్టుకు చచ్చేవాడు.
జుట్టుపోలుగాడు : నేను దిగనుగా.. ఆ.. నేను దిగనుగా.. నన్ను ఈ కుర్చీ ఎక్కించిందే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు. ఇంకా చెప్పాలంటే అదిగదిగో ఆ ఆరెస్సెస్ వాళ్లు తెల్సా.
కేతిగాడు : అవున్లే మీక్కావల్సిన వాళ్లని ఓట్ల జాబితాలో ఉంచుకుని తక్కినోళ్లను జాబితా నుండి తప్పించేందుకు ఎంత నాటకమాడుతున్నార్రా.
జుట్టుపోలుగాడు : అక్కడితో మీ రాగారంటే పప్పులో కాలేసినట్టే. మాకు ఓట్లేసేందుకు కొత్త ఓటర్లను పుట్టిస్తాం. ఆ విధంగా పేర్లు, అడ్రస్‌లు సృష్టిస్తాం. అవీ ఇవీ అంటూ వందల వేల లక్షల కోట్ల సంఖ్యలో చేర్పులు, మార్పులు జరిగిపోతాయి. చెల్లిపోతున్నాయి. అదీగాకపోతే ఈవిఎంలు ఉన్నాయిగా. ఆ మానిప్యులేషన్‌తో గెలుస్తాం. ఇదంతా పెద్ద వ్యూహం. ఎవరు ఎవరితో పోటీ చేసినా అంతిమంగా మేమే గెలుస్తాం.
కేతిగాడు : అందుకే అన్నాడు మహాకవి శ్రీశ్రీ. దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా..? అని. గతంలో మీ మోడీ నోట్ల రద్దు కార్యక్రమం పెట్టుకుని ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు ఓట్ల రద్దు కార్యక్రమం పెట్టి అసలు ఓటు హక్కు లేకుండానే చేస్తున్నాడు. అర్థమయిందిరా మీ పాపం పండే రోజు వచ్చింది. అందుకే ఎన్నికల కమిషన్ బాగోతాన్ని, లుకలుకల్ని జర్నలిస్టు రితికా చోప్రా బయటపెట్టింది. గుట్టు రట్టు చేసి నీ బట్టలూడదీసి నిలువునా నడిబజార్లో నిలబెట్టినా నీవింకా తైతక్కలాడుతూనే వున్నావు.
జుట్టుపోలుగాడు : నోర్ముయ్యరా. ఎవరెంత గుట్టువిప్పినా.. మేం చేసేది మేం చేస్తాం. సమాధానంగా నాలుగు పేజీల నోట్స్ ప్రకటన, ఓ గ్రూప్ ఫొటో మా ముగ్గురిది విడుదల చేసాంగా.
కేతిగాడు : అది కూడా మీ ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం లేదని ఇట్టే తెలిసిపోతుందిగా.. ఎంత మందికని కళ్లకు గంతలు కడ్తార్రా మీరు? ఐకమత్యం వుంటే ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు. అది మీరు చేయరు. మీ నాయకుడూ చేయడు. మీకు ప్రశ్నలంటే భయం. నిజాయితీ గల జర్నలిస్టులు అడిగే ప్రశ్నలంటే మరీ భయం. ఎందుకంటే మీ వద్ద సమాధానాలు వుండవు. మీరు చేస్తున్నది పచ్చి దగా, మోసం కనుక.
జుట్టుపోలుగాడు : ఇందులో దగా ఏముంది? అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుందిగా?
కేతిగాడు : ఆపరా నీ సోది. చేయాల్సిందంతా చేసి పైగా పైకి బుకాయింపు. నీ ఇద్దరు కమిషనర్లు సంధూ, జోషీలిద్దరూ పది నెలల కాలంలో 14 సార్లు రికార్డు పూర్వకంగా అభ్యంతరం చెప్పారు. కొత్త ఓటర్లకు ఉపయోగించే ఫారం - 6కు జత చేసే డిక్లరేషన్‌కు అసలు చట్టబద్దతే లేదని వారు వాదిస్తున్నారు. మొత్తం ఈ ప్రక్రియ అంతా యాంత్రికంగా జరిగిపోతున్నదని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. మరి ఇదంతా దగా మోసం కాదా? ప్రజాస్వామ్యానికి పౌరుని ఓటే ప్రాణం అయినప్పుడు, 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు వచ్చేలా చూడటం, వచ్చిన ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ విధి.
జట్టుపోలుగాడు : ఎప్పుడు? ఎన్నికలనేవి పవిత్రకార్యం అనుకున్నప్పుడు. కేతిగాడు : మరి మీరు మన భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపపంచానికే విశ్వగురు అంటున్నారుగా...
జుట్టుపోలుగాడు : మన కాదు. మా ప్రజాస్వామ్యం. గట్టిగా చెప్పాలంటే మా బిజెపి, ఆరెస్సెసోళ్ల ప్రజాస్వామ్యం. చెప్పానుగా నీకంత తేలిగ్గా అర్థం కాదని. మాదో దీర్ఘకాలిక పథకం. ఇది సర్వమత దేశం కాదు. హిందూమత దేశం. అందుకే వందేమాతరం అన్ని చరణాలు ప్రతిఒక్కరూ పాడాల్సిందే. హిందూ ధర్మం పాటించేలా అన్నింటిని బుల్‌డోజ్ చేస్తాం. మైనార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తాం. మహిళలు, దళితులు, ఆదివాసులు, బడుగువర్గాల వారు మేం ఏం చేసినా పడి వుండాల్సిందే. మేం చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే సహించం.
కేతిగాడు : అందుకేనా పదమూడు కోట్లమంది ఓట్లు తీసేశావ్. నిన్ను జనం అంతా దేశద్రోహి అని తిట్టిపోస్తున్నారు, ఉన్నఫళాన నిన్ను ఉరి ఉరితీసినా తప్పులేదని అంటున్రార్రో.
బంగారక్క : (ప్రవేశం) తుపాకీ ఎప్పుడూ సైనికుని చేతిలోనే వుంటుంది. కానీ ఎవరి మీద ఎప్పుడు పేల్చాలో చెప్పేది పైవాడు. ఆపై వాని కటాక్షం కోసం ఉచ్ఛనీచాలు మరిచి నీలాంటి కొందరు అంధ భక్తుల్లా వ్యవహరిస్తుంటారు. ఎంత జ్ఞానం వున్నా అప్పుడు పనిచేయదు. జ్ఞానేష్‌కుమార్ పేరు పెట్టుకున్నా కుదరదు. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా చేస్తున్నది ప్రజాస్వామ్య విధ్వంసం, హత్య. ప్రజాస్వామ్య హంతకునిగా గణతికెక్కుతున్నాడు. రక్త రహిత నరమేధానికి దారులు పరుస్తున్నాడు. అందుకే ‘సర్’ను సమూలంగా రద్దుచేయాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఎన్నికలను పారద్శకంగా నిర్వహించాలని, ఈ అవకతవకలకు కారణమైన ప్రతిఒక్కరు జ్ఞానేశ్వర్‌తో పాటు అమిత్‌షా, మోడీలు గద్దె దిగాలని, ప్రజా ఉద్యమం ఊపందుకుంటున్నది. ఎవరికైనా భారత రాజ్యాంగమే ప్రామాణికం. మన భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ఎన్నికల పరిధి అదిగమించి, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల్లో కదలిక వస్తుంది. ఆ ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యానికి నిజమైన శ్రీరామ రక్ష.
కె.శాంతారావు, 99597 45723







కామెంట్‌లు (0)