Magazines

అతిపెద్ద భూగర్భ నగరం

1 గంట క్రితం

underground city
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 2 నిమిషాల చదవడం



టర్కీలోని కపడోసియా ప్రాంతంలో ఉన్న డెరింకియు దాదాపు 20వేల మందికిపైగా నివసించగలిగిన ఓ భూగర్భనగరం. దీన్ని ఎవరు నిర్మించారో తెలియదు. 85 మీటర్ల కంటే ఎక్కువ లోతులో, 18 అంచెల్లో సొరంగాలు ఉన్నాయి. ప్రస్తుతం పురావస్తు, పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. సందర్శకులు పురాతన సొరంగాలలోని కొన్ని భాగాల గుండా నడవడంతో పాటు వందల ఏండ్ల నాటి ప్రజలు భూమి ఉపరితలం నుంచి మైళ్ల లోతున ఎలా జీవించారో చూడవచ్చు.

ఈ భూగర్భ నగరం 1963 వరకు శతాబ్దాల పాటు రహస్యంగానే ఉంది. ఓ వ్యక్తి తరచూ కనిపించకుండా పోతున్న తన కోళ్లను వెతుకుతున్న క్రమంలో గోడ వెనుక దాగి ఉన్న రంద్రాన్ని కనుగొన్నాడు. దాన్ని తవ్వడంతో భూగర్భ నగరం బయటపడింది. యుద్ధాలు, దాడుల బారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి భూగర్భ నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లోపలి వైపు నుంచి మాత్రమే తెరిచేలా బరువైన రాతి తలుపులతో మూసి ఉంచారు. లోపల నివాస గదులు, వంటశాలలు, సామగ్రి నిల్వ ప్రాంతాలు, పశువులశాలలు, వైన్, నూనె గానుగలు, ప్రార్థనా స్థలాలనూ పరిశోధకులు గమనించారు. సొరంగాలు ఒక గది నుంచి మరొక గదికి దారితీసేవి. వెంటిలేషన్ షాఫ్ట్‌లు స్వచ్ఛమైన గాలిని నగరం లోపలికి తీసుకువచ్చేవి. పురాతన కాలంలో ఈ నగరం పశువులు, ఆహార నిల్వలతో పాటు 20వేల మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఇతరుల నుంచి దాడులు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కుటుంబాలు, కార్మికులు, మొత్తం సమాజాలు భూగర్భంలో దాగి ఉండగలిగేవి.

డెరింకుయు భూగర్భంలో అనేక అంతస్తుల గదులు, సొరంగాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొనబడిన పురాతన భూగర్భ నివాసాలలో అత్యంత లోతైనది, అత్యంత సంక్లిష్టమైనది ఇదే. నెవెహిర్ ప్రావిన్స్‌లోని ఈ పురాతన భూగర్భ నగరం ఫెయిరీ చిమ్నీలు, రాతి నిర్మాణాల మధ్య భూ ఉపరితలంలో దాగి ఉంది. ఇప్పటికీ ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ అతిపెద్ద భూగర్భ నగరం మెత్తని అగ్నిపర్వత శిలలలో ఏర్పాటైంది. చాలా కాలం కిందట ప్రజలు నివసించి, పనిచేసిన నిజమైన రహస్య పట్టణంగా ఉండేది. ‘క్రీ.పూ. 1200 ప్రాంతంలో ఫ్రిజియన్ల దాడికి గురైనప్పుడు, వారు రాతిలో మొదటి కొన్ని పొరలను తవ్వి ఉండవచ్చు’ అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తూ, డెరింకుయు లోపల హిట్టైట్ కళాఖండాలు కనిపించాయి.

ఈ నగరం అధిక భాగాన్ని ఇనుప యుగానికి చెందిన అత్యంత నైపుణ్యం గల వాస్తుశిల్పులు (ఫ్రిజియన్లు) నిర్మించారని తెలుస్తోంది. ఫ్రిజియన్ల తర్వాత పర్షియన్లు, ఆ తర్వాత బైజాంటైన్ యుగంలోని క్రైస్తవులకు మారుతూ వేల ఏండ్ల పాటు దాదాపు నిరంతరం వాడుకలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. గ్రీకో-టర్కిష్ యుద్ధంలో ఓటమిని చవిచూసిన కప్పడోసియన్ గ్రీకులు హఠాత్తుగా సామూహికంగా గ్రీస్‌కు పారిపోయినప్పుడు 1920లో దీన్ని విడిచిపెట్టి ఉండొచ్చని, గుహల గదులు వందల మైళ్ల మేర విస్తరించి ఉండొచ్చని అన్నారు. 1985లో ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్