అనాది కాలం నుండి అదనపు అలంకారంగా ఆభరణాలు ప్రముఖ స్థానం ఆక్రమించాయి. ఈ ఆభరణాలు అందాన్ని మరింత ద్విగుణీకృతం చేయడానికే కాకుండా, సంపద సూచికగా, సమాజంలో తమ తమ స్థాయి, అంతస్తును తెలిపే సాధనాలుగా, వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా యుగయుగాలు నుంచి నేటి వరకూ వర్ధిల్లుతూ ఉన్నాయి. ఎన్నో నాగరికతలు చవిచూసిన ఈ మానవ పరిణామ క్రమంలో మహిళలల జీవితంలో ఆభరణాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మగువుల మనసు దోచే వివిధ ఆకారాలతో, నగిషీలతో, రంగులతో, బంగారం, వెండి, రకరకాల విలువైన రాళ్లతో వివిధ కాలాల్లో అనేక మంది నిపుణులు, హస్త కళాకారులు ఆభరణాలను తయారు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక ఆభరణం ధరించకుండా ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో! అంతలా ఆభరణాలు భారతీయుల జీవన సరళిలో ముడిపడి ఉన్నాయి. అటువంటి ఆభరణాల చరిత్రను తెలుసుకుందాం...
పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం ‘సింధూ నాగరికత’ కాలం నుండే అనగా క్రీ.పూ 2600 నుంచి 1900 మధ్య కాలంలోనే రకరకాల పూసలు, నెక్లెస్లు, గాజులు, ఇతర ఆభరణాలు ముఖ్యంగా బంగారం, గవ్వలతో, ఎర్ర రాయి (కురువింద రాయి), కొన్ని విలువైన రాళ్లతో పొదిగిన నగలు ఆనాటి ప్రజలు వాడినట్లు, ధరించినట్లు ఆధారాలు సేకరించారు. ఆనాటి ఆభరణాలు హస్త కళాకారుల నైపుణ్యాలను తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఆనాటి వర్తక వాణిజ్యంలో ఆభరణాలు ప్రముఖ పాత్ర పోషించాయి. అందానికే కాకుండా సామాజిక అంతస్తులు తెలిపే సాధనాలుగా ఆభరణాలు వర్ధిల్లాయి. ముఖ్యంగా ‘ఈజిప్టు’లో ఆభరణాలు మతపరమైన కార్యక్రమాల్లో ప్రముఖ స్థానం పొందాయి. పెద్ద పెద్ద కుటుంబీకులు, రాజ వంశాల వారు బంగారం, వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు వంటి విలువైన రాళ్లతో తయారు చేసిన అపురూపమైన ఆభరణాలు ధరించేవారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే విశ్వాసంతో మరికొన్ని ఆభరణాలు ధరించేవారు. క్లియోపాత్రా వంటి రాజకుటుంబాల వారు, వారి అధికారానికి చిహ్నంగా, రాజసానికి గుర్తుగా, అందానికి మెరుగుపరచడానికి ఆభరణాలు ధరించేవారు.
ఇక ప్రాచీన గ్రీస్, రోమ్ వంటి నగరాల్లో వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల ఉంగరాలు, చెవి రింగులు, నెక్లెస్‌లు, రకరకాల విలువైన రాళ్లతో తయారు చేసిన ఆభరణాలు ధరించేవారు. వారి కుటుంబ సభ్యులకు తరతరాలుగా ఆభరణాలను వారసత్వ సంపదగా అందించడం జరిగింది. మనదేశంలో కూడా ఇటువంటి సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. నెక్లెస్ అనేది సర్వసాధారణంగా భారతీయ కుటుంబ సభ్యులు ధరించే ఆభరణంగా నేటికీ తన ఉనికిని చాటుకుంటుంది. మన దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా వివిధ ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ‘రాణి హారం’ కుందన్ జ్యూవెలరీ, ‘పొల్కి’ మహారాష్ట్ర స్టయిల్ ఆభరణాలు, ‘మినాకారి’ (రంగులతో నగిషీ ఆభరణాలు), టెంపుల్ జ్యూవెలరీ, దక్షిణ భారతదేశంలో వివిధ దేవుళ్ళ విగ్రహాలకు ధరించే ఆభరణాలు మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రకు చెందిన ‘తుషీ’ జ్యూవెలరీ, కొల్హాపూర్‌కు చెందిన ‘సాజ్’ జ్యూవెలరీ, కాసుల హారం, ‘మంగా మలై’ వంటి వివిధ సౌందర్యవంతమైన ఆభరణాలు గత కొన్ని శతాబ్దాలుగా మన దేశంలో వర్ధిల్లుతున్నాయి. మన జీవన విధానంలో ముఖ్యంగా మహిళలు జీవితంలో భాగస్వామ్యం అయ్యాయి. మన దేశంలో హస్త కళాకారులు నైపుణ్యాలకు ప్రతీకగా విరాజిల్లుతున్నాయి.
ఇక మనదేశంలో కాలాలు మారుతున్నా, ప్రాచీన కాలం నుండి నేటి వరకూ ఆభరణాలు నూతన నగిషీలు, ఆధునిక స్టయిల్ సంతరించుకుంటూ మహిళల జీవితంలో భాగంగా సాంస్కృతిక వారసత్వంగా ఇమిడిపోయాయి. మధ్యయుగ కాలంలో యూరప్‌లో కూడా ఆభరణాలు దైవిక పరంగా, సామాజిక అంతస్తులు తెలిపే సాధనాలుగా విరాజల్లాయి. శిలువకు గుర్తుగా, లాకెట్లుగా, రాచరిక వైభవానికి ఆనవాలుగా విలువైన రాళ్లతో తయారు చేసిన ఆభరణాలు ధరించేవారు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ఆభరణాలు మరింత నూతన శైలిలో ద్విగుణీకృతం అయ్యాయి. ముత్యాలు, రత్నాలు, నీలం, డైమండ్స్‌తో కూడిన బంగారు ఆభరణాలు ప్రసిద్ధి చెందాయి. ఇక 19వ శతాబ్దంలో వ్యక్తిగతంగా ఆభరణాలు ధరించే సంస్కృతి పెరిగింది. విక్టోరియా రాణి కాలం నుండి లాకెట్లు, ఉంగరాలు, పతకాలు వంటివి బహుళ ప్రచారంలోకి వచ్చి, నచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఒకరికి ఒకరు వివిధ సందర్భాలలో చిన్న చిన్న బంగారు ఆభరణాలు ఇచ్చుకునే నూతన ఒరవడి ప్రవేశపెట్టారు. ఒకరి ఆనందం, సంతోషం పరస్పరం పంచుకోవడం ద్వారా మధురమైన అనుభూతి పొందుతుంటారు. ఇవన్నీ మధుర స్మృతులుగా ఉంటున్నాయి. కొన్ని మత పరమైన వివాహాల్లో పెళ్లి, నిశ్చితార్థం వంటి కార్యక్రమాలకు గుర్తుగా ఉంగరాలు ధరించటం ఆనవాయితీగా వస్తోంది..
ఇక 20వ శతాబ్దం నుంచి మహిళలు ధరించే బంగారు ఆభరణాలు నూతన ఫ్యాషన్, శోభను సంతరించుకున్నాయి. అతి తక్కువ ధరలో, తక్కువ నాణ్యత కలిగిన రాళ్లతో, నేడు గ్రాము బంగారం పేరుతో రకరకాల ఆభరణాలు మార్కెట్లో హల్ చల్ చేస్తూ, అందరినీ అదనపు అలంకారం వైపు నడిపిస్తున్నాయి. ప్రఖ్యాత ‘డిజైనర్ కొ కొ ఛానెల్’ క్యాస్టూమ్ డిజైన్‌లో ముందు వరుసలో నిలబడింది. వస్త్రధారణకు అనుగుణంగా ఆభరణాలు ధరించే ట్రెండ్ మొదలైంది. హాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా ఆభరణాలు ధరించడంలో ముఖ్యంగా సినీ తారలు నూతన ట్రెండ్‌కు సెట్టర్‌గా మారారు. ‘ఆడ్రీ హెప్బర్న్’ ఈ విషయంలో అందరి కంటే ముందు వరుసలో నిలబడ్డారు. ఈమె ముత్యాలు, డైమండ్స్ ధరిస్తూ ఆకర్షణీయంగా నిలిచారు. మరోవైపు ‘ఎలిజబెత్ టేలర్’ వజ్రాల ఆభరణాలను ధరించి తన అందానికి మరింత మెరుగులు దిద్దుకొని అందరినీ ఆకట్టుకున్నారు. ఇదే పంథాను ‘మార్లిన్ మన్రో’ కూడా ఆచరించారు. 1960 తర్వాత హస్త కళాకారులు మరింత సౌకర్యవంతంగా, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుని శోభోవంతమైన ఆభరణాలు తయారు చేయడం మొదలుపెట్టారు. తద్వారా దాదాపు మహిళలందరూ ఆభరణాలు ధరించేవారు. వివిధ రకాల రంగుల డిజైన్లు, నగిషీలు, మెటీరియల్స్ తేలికపాటి బరువుతో మార్కెట్లో ప్రవేశించాయి. అందరినీ ఆకట్టుకున్నాయి. ఆభరణాలు కేవలం మహిళలే కాదు మగవారు కూడా ధరిస్తూనే ఉన్నారు. ఈ విధంగా అనాది కాలం నుండి నేటి వరకూ రకరకాల పూసలు రాళ్లు మెటీరియల్స్‌తో ఆభరణాలు ధరించడం అలవాటుగా మారింది. బంగారం వెండి రకరకాల మెటల్స్ ముత్యాలు రత్నాలు డైమండ్స్ వంటి ఆభరణాలు తయారు చేస్తున్నారు.
ఐ.ప్రసాదరావు, 9390509791






కామెంట్‌లు (0)