సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభించిన డీజీపీ సీవీ. ఆనంద్
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు డిజిటల్ సేవలను, సీఐడీ కార్యకలాపాలు, సేవలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు https://cid.tspolice.gov.in/ వెబ్సైట్ను బుధవారం డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసు సేవలను ఇటీవల వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్ (సీఎఫ్సీ)ను ఏర్పాటు చేశారు. పిటిషన్లు, ఎఫ్ఐఆర్ల నమోదు, ఈ-చలాన్లు, పాస్పోర్టు వెరిఫికేషన్ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తుంది. మహిళా భద్రతా విభాగం రూపొందించిన ‘భరోసా’ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలోని 35 భరోసా కేంద్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. బాధితులకు అందించే కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస సేవల వివరాలను నమోదు చేసి, కేసు ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్యవేక్షించవచ్చు. కాగితపు రిజిస్టర్లకు బదులుగా రాష్ట్రస్థాయి డ్యాష్బోర్డులు, 23 రకాల నివేదికలు అందుబాటులో ఉంటాయి. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సమాచారాన్ని పోలీసులకు సకాలంలో చేరవేసేందుకు జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ (జేఆర్ఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్ఐసీకి చెందిన ఈ-ప్రిజన్స్ వ్యవస్థను సీసీటీఎన్ఎస్తో అనుసంధానించారు. ఖైదీల విడుదల వివరాలను సంబంధిత పోలీస్స్టేషన్లు, అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయి డ్యాష్బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణ, ఖైదీల వివరాల శోధనకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. నేర నెట్వర్క్లను గుర్తించేందుకు, ముందస్తు నిఘాను బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. 9.8 లక్షలకు పైగా ఫొటోలతో రూపొందించిన మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్ ద్వారా సుమారు 15 సెకన్లలో ముఖాలను సరిపోల్చవచ్చు. అనుమానితులు, మృతులు, గుర్తుతెలియని మృతదేహాలు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, డీజీ (సిఐడి) చారు సిన్హా, ఎడీజీ అకున్ సబర్వాల్, ఐజి (పిఅండ్ ఎల్) గజరావు భూపాల్, డీఐజీలు నారాయణ నాయక్, పరిమళ హన నూతన్ , ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, రూపేష్, ప్రవీణ్ కుమార్, మల్లారెడ్డి, బాలకోటి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)