కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన లారీ.. రెండు కార్లు నుజ్జునుజ్జు
మహిళ మృతి.. భర్త పరిస్థితి విషమం
రెండేండ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
తృటిలో తప్పించుకున్న మల్లన్న
నవతెలంగాణ – ఆలేరు రూరల్
తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. పాదయాత్ర కాన్వాయ్‌పై వెనుక నుంచి వేగం గా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ కారులో ఉన్న మహిళ మృతి చెందింది. ఆమె భర్త పరిస్థితి విషమంగా మారింది. రెండేండ్ల చిన్నారితోపాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మల్లన్న కారులో కాకుండా కాలినడకన ముందుకు సాగుతున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సమీపంలోని గౌరెల్లి–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం జైకేసారానికి చెందిన లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును ఢీకొట్టింది.
దాంతో ఫార్చునర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన (23), రెండేండ్ల కుమారుడు, డ్రైవర్ సురేష్ గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ చందన మృతిచెందింది. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లన్న ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొన్న తీవ్రతకు ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాద సమయంలో తీన్మార్ మల్లన్న ఆ వాహనంలో లేకుండా ముందుగా కాలినడకన పాదయాత్ర చేస్తుండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ ఎం.రవి, మోత్కూర్ ఎస్‌ఐ కె.సతీష్, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, రామన్నపేట ఎస్‌ఐ జి.సతీష్, వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ఇతర పోలీసులు పరిశీలించారు.
ప్రమాదమా? మరేదైనా కోణమా?
ఈ ఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే కుట్ర కోణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లేదా అధికారిక నిర్ధారణ వెలువడలేదు. ఘటనాస్థలంలో పోలీసులు వాహనాలను పరిశీలించి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)