Magazines

అర్నబ్‌ తుఫాన్‌...పారాహుషార్‌

1 గంట క్రితం

అర్నబ్‌ తుఫాన్‌...పారాహుషార్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

రైళ్ల వేళల్లో మార్పులు,

దారి మళ్లింపునకు అవకాశం

ప్రయాణికులకు 
దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి

అప్రమత్తంగా ఉండాలని సూచన

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం సన్నద్దమైంది. అర్నబ్’ తుఫాను తీవ్రత పెరుగుతున్న కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు ప్రాంతాలపై దీని ప్రభావం ఉండనుంది. ఈ తరుణంలో ప్రయాణికుల భద్రత, రైళ్ల నిర్వహణలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అర్నబ్ తుఫాను బుధవారం ఉదయం అతి తీవ్రమైన తుఫానుగా బాపట్ల, విశాఖపట్నం (యానాం సమీపంలో) మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో వరంగల్, హనుమకొండ, సూర్యాపేట , నల్లగొండ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తరుణంలో ఈ మార్గాల్లో ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ , ఇతర సంబంధిత అధికారులతో భద్రతా చర్యలు ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలను, ఆయా ప్రదేశాలలో చేపడుతున్న గస్తీ ఏర్పాట్లు, పెట్రోల్‌మెన్, వాచ్‌మెన్‌ల నియామకాన్ని చెరువు నీటి మట్టాల స్థితిని కూడా సమీక్షించారు. ఆయన కాజీపేట, డోర్నకల్ వద్ద బండరాళ్లు, ఇసుక సంచులు , కంకర రేక్‌లతో పాటు ప్రమాద సహాయక రైళ్లతోపాటు సహాయక వైద్య పరికరాల సంసిద్ధత, వాటి మోహరింపును కూడా సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి, అన్ని విభాగాల అధిపతులు, ముఖ్యంగా- ఆపరేటింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాల అధిపతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. డివిజనల్, ప్రధాన కార్యాలయ స్థాయిలలోని అధికారులు, సీనియర్ సూపర్‌వైజర్ల రైలు కార్యకలాపాలను, వంతెనల పరిస్థితిని, ప్రమాదకర ప్రదేశాలలో నీటి మట్టాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రయాణిలకు సూచనలు

రైలు ప్రయాణికులు భారీ వర్షాలు, తుఫాణి పరిస్థితులు వంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ రైలు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.

రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళిక మొదలైన రైలు సేవల విధానంలో మార్పులకు సంబందించిన సమాచారాన్ని రిజర్వ్డ్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన ప్రయాణికుల మొబైల్ నంబర్లకు ఎస్. ఎమ్. ఎస్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.

రైలు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, ఐ.ఆర్.సి.టి.సి, రైల్ వన్, ఎన్.టి.ఈ.ఎస్ మొదలైన అధికారిక రైల్వే అప్లికేషన్లు, వెబ్‌సైట్‌ల నుంచి రైళ్ల ప్రస్తుత స్థితిని సరిచూసుకోవచ్చు లేదా సరైన సమాచారం కోసం 139 విచారణ నంబర్‌కు డయల్ చేయవచ్చు.

రైలు సర్వీసుల సరళిలో మార్పును ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా క్రమం తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది.

రైళ్ల రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళికకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు -X ఖాతా, ఫేస్‌‌బుక్‌, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతోపాటు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్లో కూడా పొందొచ్చు.

ఈ కాలంలో రైళ్లకు సంబంధించిన ఏవైనా సందేహాల కొరకు, ప్రయాణికులు దయచేసి సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని అధికారులను సంప్రదించగలరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్