హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
మతోన్మాద విషసంస్కృతి పెరగడం వల్లే దౌర్జన్యాలు :కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరగటం అమానుషమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, డీబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు జి.నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. వాటన్నింటిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్, డీబీఎస్యూ, డీబీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో...‘దళితులపై జరిగిన దాడులను’ నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ దళితులపై దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంటే దేశంలో ఇంకా కుల జాఢ్యం పోకపోవటం శోచనీయమని అన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
స్కైలాబ్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి, బతకమ్మ, దసరా ఉత్సవాల కంటే ముందు రాష్ర్ట వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో జరిగిన హిందూ సమ్మేళనాల ప్రభావంతోనే దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులపై దాడి చేసి, కొట్టిన వారిని ఎస్సీ సామాజిక తరగతికి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి వెనకేసుకుని రావటం, వారిని రక్షించటం శోచనీయమని అన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దళితులపై జరిగిన దాడులను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. వనపర్తి జిల్లాలో దళిత యువకుడిని గుడిలోకి రావొద్దంటూ కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మేనమామలను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం వెనక అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సాంస్కృతిక సారధి ద్వారా కళా ప్రదర్శనలు ఇప్పించడంతోపాటు ప్రతి నెలా చైతన్య సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నరసింహ మాట్లాడుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే దళితులపై దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ.రమ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నేటికీ కొనసాగడం అమానుషమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదామ్ రాజ్, సీనియర్ దళిత నాయకులు సంగీతపు రాజలింగం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కొమ్ము తిరుపతి, డీబీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అమృత, రాష్ట్ర నాయకులు దాసరి శ్రీనివాస్, రామచంద్రం, రిటైర్డ్ ప్రొఫెసర్ కుమారస్వామి ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కుర్నెల్లి వెంకట్, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకట్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రకాష్ కరత్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, వంగూరు రాములు, దర్శనం రమేష్ గంధం మనోహర్, పంచమి చంద్రం, నర్సింహ్మ, గురుదాస్, కోనాయిపల్లి దాడికి గురైన బాధితులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)