Magazines

శత వసంతాల చుక్కా రామయ్య

2 గంటల క్రితం

Ramaiah
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 4 నిమిషాల చదవడం

ఘనంగా వందేండ్ల పుట్టినరోజు వేడుకలు

ఆయనకు సమకాలీకులు లేరు : సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆదర్శమైన జీవితం : హరీశ్‌‌రావు..వేగుచుక్క : జూలకంటి

సమాజానికి వజ్రంలాంటివారు : కూనంనేని

శిఖరసమానులు : జస్టిస్‌‌ సుదర్శన్‌‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య వందేండ్ల జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌‌లోని విద్యానగర్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన శతవసంతాలను పూర్తి చేసుకున్నందుకు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘మన చుక్కా రామయ్య, వందేండ్ల పండుగ’పుస్తకాన్ని జస్టిస్‌ ‌బి సుదర్శన్‌‌రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఎం అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, డికె అరుణ, ఎమ్మెల్సీ కోదండరామ్‌, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు చెరుపల్లి సీతారాములు, కె నాగేశ్వర్‌, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పాతూరి సుధాకర్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌‌రెడ్డి, సీనియర్‌‌ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి, హరగోపాల్‌, కె శ్రీనివాస్‌, బి నర్సింగ్‌‌రావు, జయధీర్‌ ‌తిరుమలరావు, సి రోహిన్‌‌రెడ్డి, టీఎస్‌‌యూటీఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, శ్యామ్‌తోపాటు బంధువులు, అభిమానులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలు చుక్కా రామయ్యను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మరింత ‌కాలం బతకాలని ఆకాంక్షించారు.

తెలంగాణకే గర్వకారణం : సీఎం రేవంత్ రెడ్డి
చుక్కా రామయ్య వందో జన్మదినోత్సవం రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారని కొనియాడారు. ఐఐటీ అనే ప‌దాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ గొప్ప విద్యావేత ఆయనేనని గుర్తుచేశారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా ఈ ప్రాంతంపైన‌ ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు. చుక్కా రామయ్య, కె నాగేశ్వర్ వంటి వారితో పనిచేయడాన్ని తాను గొప్పగా చెప్తానని అన్నారు. తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్య‌క్తులు ఉన్నారనీ, వారు కాలం, రాజకీయాలకు అతీతులని అన్నారు. వారి అంకితభావం, చిత్తశుద్ధి విషయంలో రాజకీయ నాయకులంతా ఏకాభిప్రాయంతో ఉంటారని చెప్పారు. చుక్కా రామ‌య్య స‌మ‌కాలీకులు తెలంగాణలో లేరని అన్నారు. ఆయన ఆలోచ‌న‌లు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకెవెళ్తుందని చెప్పారు. చుక్కా రామయ్య జీవితం ఆదర్శమని హరీశ్‌‌రావు అన్నారు.

విలువలతో కూడిన విద్యావ్యవస్థ అవసరం : జూలకంటి

విలువలతో కూడిన విద్యావ్యవస్థ కావాలని చుక్కా రామయ్య కోరుకున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. ఆయన ఆలోచనలు, భావాలు, సైద్ధాంతిక అంశాలు, విలువలు అందరూ పాటించాలని కోరారు. విద్యావేత్తగా, ప్రజాప్రతినిధిగా, సామాజికవేత్తగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. రామయ్యతో కలిసి తాను ఆరేండ్లు ఎమ్మెల్సీగా కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటం, సాయుధ పోరాటం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు.

మూలాధారం కమ్యూనిజం : కూనంనేని

వృత్తి, సమాజం గురించి ఆలోచించే గొప్ప దార్శనికుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. సమాజానికి ఆయన వజ్రంలాంటి వారని వివరించారు. కోటికొక్కరు ఇలాంటి వారుంటారని అన్నారు. ఆయన ఔన్నత్యం, మానవత్వంతో కూడిన మహనీయుడని చెప్పారు. ఇవన్నీ చేయడానికి ఆయనకు మూలాధారం కమ్యూనిజమేనని స్పష్టం చేశారు.

పూజ చేస్తారు... మార్క్సిజం గురించి చెప్తారు : సుదర్శన్‌‌రెడ్డి

రాజ్యాంగ విలువలకు చుక్కా రామయ్య ప్రతీక అని జస్టిస్‌ ‌బి సుదర్శన్‌‌రెడ్డి అన్నారు. ఆయన శిఖర సమానులని చెప్పారు. ఆయన వెనకాల పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం, ఇంట్లో సరస్వతీ విగ్రహాలుంటాయని వివరించారు. ఆయన పొద్దున్నే పూజ చేయటం, తర్వాత మార్క్సిజం గురించి మాట్లాడటం ఆయన గొప్పతనమని చెప్పారు. ఏ విలువలు సమాజానికి అవసరమో వాటిని పాటించేవారని అన్నారు.

లెక్కలు, సమాజమంటే ఇష్టం : కె నాగేశ్వర్‌

చుక్కా రామయ్యకు లెక్కలు, సమాజం అంటే ఎంతో ఇష్టమని మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ అన్నారు. ప్రమాణాల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారనీ, తన కొడుక్కి ఆయన కోచింగ్‌ ‌సెంటర్‌‌లో సీటు ఇవ్వలేదని చెప్పారు. భౌతికవాదాన్ని, ఆధ్యాత్మిక వాదాన్ని మేళవించిన వ్యక్తి చుక్కా రామయ్య అని అన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించారని గుర్తు చేశారు.

ఆదర్శంగా బతికారు : కోదండరామ్‌

ఆయనకు తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కోదండరామ్‌ అన్నారు. ఆదర్శంగా బతికారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఆయన గొప్ప విద్యావేత్తగా, సామాన్య ప్రజలతో కలిసి మెలిసి జీవించారని చెప్పారు. ప్రాథమిక ఉపాధ్యాయుడు, వర్సిటీ ప్రొఫెసర్‌ను ఒకే రకంగా చూసేవారని అన్నారు. ఆయన విలువలను, ఆచరణను ముందుకు తీసుకెళ్లడమే కర్తవ్యమని చెప్పారు.

రావాల్సినంత గుర్తింపు రాలేదు : హరగోపాల్‌

ప్రజా జీవితంలో ఉండే వారు ఎక్కువ కాలం జీవిస్తారనీ, అందుకు చుక్కా రామయ్య నిదర్శనమని ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, సాయుధ పోరాటంతోపాటు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారని వివరించారు. కానీ ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 16 సంఘాలపై నిషేధం విధించడం పట్ల రామయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారని గుర్తు చేశారు.

తెలంగాణలోనూ నిర్బంధాలు ఎదుర్కొన్నారు : కె శ్రీనివాస్‌

దేశానికి మానవ వనరులను అందించిన గొప్ప వ్యక్తి చుక్కా రామయ్య అని ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె శ్రీనివాస్‌ ‌చెప్పారు.విద్యా, రాజకీయ జీవితం గొప్పదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ నిర్బంధాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షులు రజని, నాయకులు రాజా, బిఎన్‌ ‌రెడ్డి, మమత, టీఎస్‌‌యూటీఎఫ్‌ ‌మాజీ అధ్యక్షులు కె జంగయ్య, ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, టీపీసీసీ అధ్యక్షులు బి మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌ ‌శుభాకాంక్షల సందేశం పంపించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్