Magazines

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పారదర్శకంగా నిర్వహించాలి

1 గంట క్రితం

Certificate verification should be conducted transparently.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

అనర్హులపై చర్యలు తీసుకోవాలి

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలి :

ఇంటర్‌ బోర్డు వద్ద ధర్నాలో ఎస్ఎఫ్ఐ నేతలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాలనీ, అనర్హులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రయివేట్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని కోరింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసిన ప్రక్రియలో సమర్పించిన సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరిపి, వెరిఫికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 2023లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. వీరిలో ఇప్పటికే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు గుర్తించిన 35 మందిని తొలగించినట్టు చెప్పారు. మరో 700 నుంచి 800 మంది వరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పీజీ చదివినట్టు సర్టిఫికెట్లు సమర్పించి రెగ్యులరైజ్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించిన అధికారులు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 400 సర్టిఫికెట్లను బోర్డుకు సమర్పించగా, వాటిలో కొన్ని చదివినట్టు ధ్రువీకరించే లేఖలు కూడా నకిలీవని వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సమర్పించిన అన్ని సర్టిఫికెట్లను సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయినట్టు విచారణలో తేలిన లెక్చరర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ జూనియర్ కళాశాలలకు ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వలేదని బోర్డు ప్రకటించినప్పటికీ, కొన్ని కళాశాలలు అనుమతులు ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, సరైన వసతులు లేకుండా ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రయివేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అఫిలియేషన్ లేకుండా విద్యార్థులను చేర్పించుకునే కళాశాలలపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత, కార్యదర్శివర్గ సభ్యులు జి.కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, రమేష్, నాయకులు నాగేందర్, భగత్, అర్జున్, వర్ధన్, నీరజ్, శ్యామ్, అజయ్, కౌశిక్, భారత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్