Magazines

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్సే

1 గంట క్రితం

farmers
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

క్రాప్‌ హాలిడే అంటున్న సీఎంకు హాలిడే ఇవ్వాలి

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

750 టీఎంసీల నీటిని ఎత్తిపోయని దుర్మార్గుడు రేవంత్‌‌

సింగరేణిని దివాళా తీసి కరెంటు లేకుండా చేశారు :ఆదిలాబాద్‌ ‌రైతు గర్జన సభలో కేటీఆర్‌


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి
‘‘క్రాప్‌ ‌హాలిడే అంటున్న సీఎం రేవంత్‌‌రెడ్డికి హాలిడే ఇవ్వాలి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు కాటకాలు కాలం తెచ్చిన కరువు కాదని.. ఇది కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువే’’ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ ‌జిల్లా కేంద్రంలోని డైట్‌ ‌మైదానంలో నిర్వహిం‌చిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు జిల్లాలోని నేరడిగొండ, తలమడుగు మండలాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కరువుకు కల్పతరువు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయక పోవడంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయన్నారు. జూన్ నెలలోనే బీఆర్ఎస్ నాయకులమంతా కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్దకు వెళ్లి పంపులు ఆన్ చేసి ఎస్‌ఆర్‌ఎస్‌పీ, చెరువులు నింపాలని కోరినా ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే 35 లక్షల ఎకరాల్లో వానాకాలం పంట దెబ్బతిన్నదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువు అని స్పష్టం చేశారు.


750 టీఎంసీల నీటిన వృధాగా సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు. కేవలం కేసీఆర్‌‌ను విమర్శించడాని‌కే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ పట్టుదలకు పోయి రాష్ట్రంలో కరువు పరిస్థితులు రావడానికి సీఎం రేవంత్‌‌రెడ్డి కారకుడయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతలకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు. ​రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 15,000 పెట్టుబడి సహాయం అందిస్తామని శఠగోపం పెట్టారని విమర్శించారు. ​ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ.12,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మూడేండ్లు అయ్యిందన్నారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణి బొగ్గు ఉత్పత్తిని దెబ్బతీసి కరెంట్ ఉత్పత్తి తగ్గించారని, ఫలితంగా మళ్లీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. యూరియా కోసం రైతులు లైన్లలో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయని చెప్పారు.

కేసీఆర్ హయాంలో రైతు ఎలా చనిపోయినా 15 రోజుల్లో రూ. 5 లక్షల రైతు బీమా డబ్బులు రైతు కుటుంబాలకు అందాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో ఆ పథకం బొందపెట్టబడిందని ఆరోపించారు. ​రాజ్యం ఏలుతున్నది రాబందు అని, అందుకే అన్ని బందులు పెడుతున్నారని రైతు బంధు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ఇలా అన్ని పథకాలను రద్దు చేస్తున్నారని అన్నారు. రూ.15,000 రైతు బంధు దేవుడెరుగు, కనీసం యూరియా ఇచ్చే దిక్కు లేదన్నారు. దుక్కిదున్ని వ్యవసాయం చేద్దామంటే ప్రభుత్వం యాసంగి పంటకు దుక్కిదున్నొద్దు, విత్తనం చల్లొద్దు, వ్యవసాయం చేయొద్దు.. క్రాప్ హాలిడే..అని అంటోందన్నారు. రైతులెవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దు అని చెబుతున్నారని తెలిపారు. ‘భూముల్ని పడావు పెట్టండి.. పంటలు మాత్రం వేయకండి’ అని రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్టుగా చెప్పే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్‌ ‌బాల్క సుమన్‌, గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు అనిల్‌‌జాదవ్‌, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌‌రావు, జెడ్పీ చైర్మెన్‌ ‌జనార్ధన్‌ ‌రాథోడ్‌, నాయకులు జాన్సన్‌ ‌నాయక్‌, భార్గవ్‌ దేశ్‌‌పాండే పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్