దేశంలో 20 కోట్ల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర
‘రామ్ లీలా’ వేదిక సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్లండి : సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నరేంద్ర మోడీని ఓడించేందుకు కాంగ్రెస్ వానర సైన్యం పోరాడుతోందని, ఈ పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ‘వానరసైన్యం’గా ఆయన అభివర్ణించారు. ‘‘ఓట్ బజావో– దేశ్ బచావో’’ అనే నినాదంతో బీజేపీ నేతల గుండెలు బెదిరేలా ఢిల్లీ పీఠాన్ని వణికించాలన్నారు. రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకునే దీక్షతో... మోడీ గద్దె కూలక తప్పదని, వాళ్లు గుజరాత్ వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ చారిత్రాత్మక వేదిక నుంచి ఇండియా బ్లాక్ నేతలు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికీ, ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘ఇండియా’ బ్లాక్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో ఢిల్లీ.. రామ్ లీలా మైదాన్’ భారీ బహిరంగ సభకు ముందు ముఖ్యమంత్రి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి ప్రధాని మోడీ రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్ల తొలగించాలని భావించారని ఆయన ఆరోపించారు. కానీ ఓటు హక్కుతో ప్రజలు ఆ సంఖ్యకు చేరుకోనివ్వకపోవడంతో పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై కక్ష పెంచుకున్న మోడీ ఓటు హక్కు తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర
బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించారని, కానీ ఆ ఓటు హక్కును తొలగించేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకొని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఓట్లలో 15 నుంచి 20 శాతం ఓట్లు తొలగించేందుకు వ్యూహాలు చేస్తున్నారన్నారు. ప్రయోగాత్మకంగా ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కేంద్రంలోనూ మరోసారి అలానే అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో రాంలీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిపారు.
‘ రామ్ లీలా’ ర్యాలీ... ాబోయే సార్వత్రిక ఎన్నిలకు నాంది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో ఇండియా బ్లాక్ చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ర్యాలీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల ద్వయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ చోరీ, పార్టీ చీలికలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోందని మండిపడ్డారు. ఆదివారం రామ్ లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ నిర్వహించిన ‘చలో ఢిల్లీ.. ఓట్ బచావో–దేశ్ బచావో’ ర్యాలీకి తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ‘గ్యాదరింగ్ మీటింగ్’ లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, లెక్క చేయకుండా కార్యకర్తలు ఢిల్లీ చేరుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివచ్చారని వెల్లడించారు.
కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కేంద్రంలోని మోడీ సర్కార్ అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. చివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ తన స్వతంత్రతను కోల్పోతుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వతంత్ర నిర్ణయాలతో పని చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో కార్యకర్తలను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ...సర్ పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 25 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తొలుత కొందరు ఈ అంశాన్ని రాజకీయ విమర్శగా భావించారని, ఇప్పుడు ఎన్నికల సంఘంలోని సభ్యుల నుంచే అభ్యంతరాలు రావడంతో దేశ ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఓట్ చోరీలో మోడీ పాత్ర... : మంత్రి సీతక్క ఆగ్రహం
దేశ వ్యాప్తంగా చోరీకి గురైన 13 కోట్ల ఓట్ల ప్రక్రియలో ప్రధాని మోడీ పాత్ర ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. అందుకే మోడీ ఒక దొంగను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో మంత్రి సీతక్క మాట్లాడారు. ఓటు చోరీకి పాల్పడిన వారిని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాపాడుతోందన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా ప్రధాని మోడీ విరమించుకోవాలన్నారు.
అడ్రస్ మారితే ఓటు తొలగింపా...? : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అడ్రస్ మారితే ఓటర్ లిస్ట్ నుంచి ఓట్లను ఎలా తొలగిస్తారంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ బీజేపీ ప్రభుత్వం జ్ఞానేశ్‌కుమార్‌ను వెనకేసుకొస్తోంది’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన బహిరంగ సభ దెబ్బకు కేంద్రం దిగివచ్చి జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయడం ఖాయమని చెప్పారు.






కామెంట్‌లు (0)