Magazines

క్వారీల్లో కాసుల దందా

51 నిమిషాల క్రితం

The Money-Making Racket in Quarries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

జోరుగా సాగుతున్న ఇసుక ఓవర్ లోడ్

కొరవడిన అధికారుల నిఘా

కనిపించని ఆర్‌టీఓ తనిఖీలు

నవతెలంగాణ – ఉప్పల్ (గుత్తి శేఖర్ )

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియాను అరికట్టేందుకు ఓవర్‌లోడ్‌ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు పాసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో గత కొంతకాలం పాటు ఇసుక రవాణా సజావుగా సాగింది. అయితే ప్రస్తుతం అధికారుల నిఘా కొరవడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

కొన్ని క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఓవర్‌లోడ్‌ ఇసుక దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది అండదండలు, పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రభావంతో ఈ అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని పాల్గుల 3, కన్నెపల్లి, మహాదేపూర్ క్వారీలలతో పాటు ములుగు జిల్లా లోని వాడేగూడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సర్జితపల్లి పలు క్వారీలలో సైతం ఈ దందా కొనసాగుతుంది. దింతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలను అరికట్టే చర్యలు తీసుకోవాలి.

​నజరానాల మత్తులో ఓవర్‌లోడ్‌ దందా!

. ఇసుక క్వారీలలో యదేచ్చగా ఓవర్ లోడ్ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వారీల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బంది నజరానాలకు ఆశపడి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుకుబడిని ఉపయోగించుకుంటున్న కొందరు వ్యక్తులు సిబ్బందికి నజరానాలు ఆశచూపి అక్రమాలకు తెరలేపుతున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం 16 టైర్ల లారీలో. మైనింగ్ నిబంధనల ప్రకారం 35 టన్నులు, 14 టైర్ల లారీ లో 32 టన్నులు ఇసుక రవాణా చేయాలి. ఇసుక వేబ్రిడ్జిపై బరువు తూకం వేసిన అనంతరం వే బిల్ ఇస్తారు. ఆ తర్వాత కిందస్థాయి సిబ్బంది కనుసన్నల్లో తిరిగి అదే లారీలో అదనంగా ఇసుకను నింపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇతర లారీలతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు టన్నుల అదనపు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు తెలుస్తోంది

ప్రతిరోజూ ఈ వ్యవహారం కొనసాగుతున్నా క్వారీల్లో విధులు నిర్వహిస్తున్న పీఓలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాల్లో వారికి కూడా ముడుపులు అందుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్వారీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు వేబ్రిడ్జి వద్ద లోడింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

​ఆర్‌టీఓ అధికారుల నిఘా వైఫల్యం..

కొంతకాలంగా ఇసుక లారీల్లో పాసింగ్‌ లోడ్‌ మాత్రమే రవాణా అవుతుండటంతో ఆర్‌టీఓ అధికారులు తనిఖీలను పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఇసుక లారీ యజమానులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని క్వారీల నుంచి అనుమతించిన పాసింగ్‌ లోడ్‌కు అదనంగా నాలుగు నుంచి ఐదు టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఆర్‌టీఓ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఓవర్‌లోడ్‌ దందా యథేచ్ఛగా సాగుతుంది . ఇప్పటికైనా అధికారులు స్పందించి క్వారీల నుంచి బయలుదేరే ఇసుక లారీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఓవర్‌లోడ్‌ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
క్వారీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఇసుక అక్రమ ఓవర్‌లోడింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన అనంతరం పాసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కొంతమంది క్వారీల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని లారీలకు నిబంధనలకు మించి 3 నుంచి 4 టన్నుల వరకు అదనంగా ఇసుక లోడ్ చేస్తున్నారు. దీనివల్ల పాసింగ్ విధానం లక్ష్యం నీరుగారుతోంది. ప్రతి క్వారీలో సీసీ కెమెరాలు అమర్చి పర్యవేక్షించాలి. అక్రమ ఓవర్‌లోడింగ్‌కు పాల్పడుతున్న సిబ్బంది, వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం అధ్యక్షుడు సూర్వి రాజు గౌడ్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్