ఆదివాసీలకు ప్రత్యేక మతంపైనా తీర్మానించాలి : సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనగణనలో ఓబీసీ కులగణన కాలమ్ ను చేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. ఆదివాసీల మతాన్ని నమోదు చేయడానికి జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ, కౌన్సిల్ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా బీసీలకు జనాభా దామాషా దక్కాల్సిన ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎంత మంది ఉన్నారనే దానిపై చట్టబద్దమైన లెక్కలు లేకపోవడంతోనే వారికి ఫలాలు దక్కడం లేదని తెలిపారు.
జనగణనలో ఎస్సీ, ఎస్టీలను లెక్కించినట్టుగానే ఓబీసీలను లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనగణనలో కులాన్ని నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఉన్నప్పటికీ.. వారంతా ఓబీసీలకు చెందుతారని చెప్పడానికి ఎలాంటి కాలమ్ లేదని తెలిపారు. ఫలితంగా ఓబీసీ కులాల వారిని ఇతరుల కేటగిరిలో చేర్చుతారని, ఫలితంగా ఓబీసీల జనాభా ఎంత అనే దానిపై స్పష్టత లేకుండా పోతుందన్నారు. జనగణనలో ఓబీసీలను లెక్కించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అనేక ఓబీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయని వివరించారు. వారి ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
దేశ మూలవాసులైన ఆదివాసీలది ప్రత్యేక జీవన శైలిని అని కవిత గుర్తు చేశారు. ప్రకృతిని, అడవిని తమ వేల్పుగా పూజించడం ఆదివాసీల ప్రత్యేకత అని తెలిపారు. ఒక్కో ఆదివాసీ తెగ ఒక్కో దేవతను, చెట్టును, పక్షిని, జంతువును పూజిస్తాయనీ, గతంలో చేపట్టిన జనగణనలో వారిని ప్రత్యేక మతంగా నమోదు చేసే వారని తెలిపారు.
జనగణనలో ఆదివాసీల మతం నమోదుకు ప్రత్యేక కాలమ్ లేకపోవడంతో ఆయా వర్గాల వారు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఓబీసీల జనాభా లెక్క తేలాలన్నా, ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇందుకోసం వెంటనే తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఓబీసీల కులగణన, ఆదివాసీల మతం నమోదుపై వేర్వేరు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కవిత సూచించారు.






కామెంట్లు (0)