Magazines

అరుణమయమైన నల్లగొండ

5 గంటల క్రితం

Nalgonda
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

మరో చారిత్రక ఘట్టానికి వేదికైన పోరాటాలగడ్డ

జాతీయ మహాసభలకు సర్వం సిద్ధం

రేపటి నుంచి 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ

ఇంటికో మనిషి.. ఊరికో బండితో..

15న లక్ష మంది రైతులతో బహిరంగ సభ

28 రాష్ట్రాల నుంచి 1,200 మంది ప్రతినిధులు..

పరిశీలకులతో కలిపి మొత్తం రెండు వేల మంది రాక

16న జీఎం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రతినిధుల సభ

నేడు 125 స్టాళ్లతో అగ్రి షో...సాంస్కృతిక ఉత్సవాలు


నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​దేశవ్యాప్తంగా ఏఐకేఎస్‌కు ఉన్న 1.58 కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు, పరిశీలకులు, ఇతరులు కలిపి సుమారు రెండు వేల మంది మహాసభలకు హాజరవుతారు. భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్లగొండ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. దేశ రైతాంగ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల15 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఈ మహాసభకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తరలిరానున్నారు. 'ఇంటికో మనిషి.. ఊరికో బండి' అన్న పిలుపుతో గ్రామగ్రామాన జనసమీకరణ సాగుతోంది. ఎర్రజెండాలు, తోరణాలు, స్వాగత ద్వారాలు, బ్యానర్లతో నల్లగొండ పట్టణం అరుణమయంగా మారింది.

ఈ నెల 15న ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మంది రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించాలని ఆహ్వాన సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్‌ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షు‌లు డాక్టర్ అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తదితరులు ప్రసంగించనున్నారు.

​మర్రిగూడెం బైపాస్ నుంచి 
ఎన్జీ కాలేజీ వరకు మహా ప్రదర్శన..

​బహిరంగ సభకు ముందు మధ్యాహ్నం ఒంటి గంటకు మర్రిగూడెం బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు భారీ మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్లు ఎర్రచొక్కాలు ధరించి కవాతు చేయనున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, ప్రజాసంఘాల కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొననున్నారు.

​28 రాష్ట్రాల నుంచి 1,200 మంది ప్రతినిధులు

15 నుంచి 18 వరకు నల్లగొండలోని జీఎం కన్వెన్షన్ సెంటర్‌లో జాతీయ ప్రతినిధుల సభ జరగనుంది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. పరిశీలకులు, ఇతరులతో కలిపి రెండు వేల మంది హాజరవుతారు. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతులకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, పంటల కొనుగోళ్లు, రైతుల రుణభారం, వ్యవసాయ కార్మికుల ఉపాధి, సాగునీటి సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, కార్పొరేట్ సంస్థల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

​నేడు 125 స్టాళ్లతో అగ్రి షో ప్రారంభం

మహాసభకు అనుబంధంగా 14, 15, 16 తేదీల్లో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో భారీ వ్యవసాయ ప్రదర్శన (అగ్రి షో) నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు 125 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, వివిధ పరికరాలను ప్రదర్శించనున్నారు. అగ్రిషో ప్రారంభ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తదితరులు పాల్గొననున్నారు. క్లాక్ టవర్ సెంటర్‌లోనే 14 నుంచి 16 వరకు సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి.

​

90 ఏండ్ల ఏఐకేఎస్ ప్రస్థానం.. 80 ఏండ్ల తెలంగాణ పోరాట వారసత్వం

​1936లో ఆవిర్భవించిన అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్తంగా రైతాంగ హక్కుల కోసం తొమ్మిది దశాబ్దాలుగా ఉద్యమిస్తోంది. సంస్థ 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏండ్ల చారిత్రక నేపథ్యం ఈ మహాసభకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల త్యాగాలు నేటికీ రైతాంగ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. నాటి పోరాట వారసత్వాన్ని నేటి వ్యవసాయ సమస్యలతో అనుసంధానిస్తూ జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్