మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గతేడాది ఇదే నెలలో దారుణ హత్యకు గురైన సీపీఐ(ఎం) నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ సామినేని రామారావు (72) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఏడాది తర్వాత పోలీసులు ఈ కేసులో అరెస్టులు చూపించడం గమనార్హం. ఈ కేసును ఖమ్మం జిల్లా పోలీసులు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో ఛేదించామంటున్నారు. కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. రాజకీయ, ఆర్థిక విభేదాల కారణంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు కత్తులు, రెక్కి నిర్వహణకు వాడిన నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
గతేడాది అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున రామారావు తన ఇంటి పక్కన ఉన్న షెడ్డులో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చింతకాని పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 103(1), 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ బృందాలు పరిశీలించి నిందితులకు సంబంధించిన బూట్లు, కాలి ముద్రలు, క్లాత్ పీస్, కత్తి కవర్‌తో పాటు పలు కీలక భౌతిక ఆధారాలను సేకరించినట్టు వివరించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికంగా, ఫిజికల్‌గా లోతుగా విచారణ జరిపినట్టు చెప్పారు. సందేహాస్పదంగా ఉన్న 24 మందికి పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరగా, అందులో ఆరుగురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. 2026 జనవరి నెలలో బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో వీరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించగా, ఆ ఆరుగురికి ఈ నేరంలో ప్రమేయం లేదని తేలిందన్నారు.
అనంతరం గుజరాత్‌లోని గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నుంచి ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం ఖమ్మం వచ్చి చేసిన ఫోరెన్సిక్ విశ్లేషణ, ఇతర సాంకేతిక లొకేషన్ ఆధారాల ద్వారా అసలు నిందితులను గుర్తించగలిగినట్టు సీపీ వివరించారు. అరెస్టయిన నలుగురు నిందితులు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలానికి చెందిన వారని తెలిపారు. ప్రధాన నిందితుడు (ఏ -1) బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను (మేస్త్రి పని), (ఏ -2) నూకల లింగయ్య (వ్యవసాయం), (ఏ -3) మల్లారపు లక్ష్మయ్య (పెయింటర్), (ఏ -4) కార్లపూడి ఉదయ్ కుమార్ అలియాస్ రుక్మాన్ కుమార్ (పెయింటింగ్ పని) ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నలుగురిపై గతంలో కూడా మర్డర్, హత్యాయత్నం వంటి నేరాలకు సంబంధించి క్రిమినల్ రికార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. ముందు ముందు విచారణను మరింత వేగం చేస్తామని చెప్పారు. సవాళ్లతో కూడుకున్న ఈ క్లిష్టమైన కేసును ఛేదించడంలో వైరా ఏసీపీ ఎస్. సారంగపాణి సమగ్ర పర్యవేక్షణలో వైరా సీఐ వై. వెంకట ప్రసాద్, ఎస్ఐలు వీరేందర్, జి. నరేష్, అలాగే టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఇతర విభాగాలు విశేష ప్రతిభ కనబరిచాయని సీపీ సునీల్ దత్ ప్రశంసించారు. ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు.







కామెంట్లు (0)