రైతులకు రూ.1,100 కోట్లు చెల్లించిన టీజీ ఆయిల్ ఫెడ్
ప్రాసెసింగ్‌లో 44.60 శాతం వృద్ధి
ఒకే ఏడాదిలో 4.74 లక్షల మెట్రిక్ టన్నుల గెలల ప్రాసెసింగ్
ప్రభుత్వ రంగంలో తొలి ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిలో తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ (టీజీ ఆయిల్ ఫెడ్) చరిత్ర సృష్టించింది. గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) ప్రాసెసింగ్‌లో ఏకంగా 44.60 శాతం వృద్ధిని నమోదు చేసింది.
2025-26లో గెలల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు సుమారు రూ.1,100 కోట్లను చెల్లించింది. మెట్రిక్ టన్నుకు సగటున రూ.23,100 ధర అందించింది. 2024-25లో 3,27,803 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసిన టీజీ ఆయిల్ ఫెడ్.. 2025-26లో ఏకంగా 4,73,997 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. అప్పారావుపేట, నర్మెట్ట ఆయిల్‌పామ్ తోటల నుంచి వచ్చిన సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల గెలలను సైతం సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తూ 19.62 శాతం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో సాధించింది. ప్రభుత్వ రంగంలోనే తొలిసారిగా ఆయిల్‌పామ్ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
ఆయిల్ ఫెడ్ 2025-26లో ఒక నెలలో అత్యధికంగా 50,150 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసింది. గత ఏడాది ఇది 39,840 మెట్రిక్ టన్నులే. రోజువారీ ప్రాసెసింగ్‌ను 1,650 మెట్రిక్ టన్నుల నుంచి 1,850 మెట్రిక్ టన్నులకు పెంచింది.
అశ్వారావుపేట ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటే ఈ ఏడాది 1,01,495 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేయడం విశేషం.
నట్ ఉత్పత్తి 22,788 మెట్రిక్ టన్నుల నుంచి 33,182 మెట్రిక్ టన్నులకు పెరిగింది. పామ్ కెర్నల్ ఆయిల్ రికవరీ 17.17 శాతం నుంచి 17.64 శాతానికి మెరుగుపడగా, పీకేఓ ఉత్పత్తి 5,075 మెట్రిక్ టన్నుల నుంచి 5,853 మెట్రిక్ టన్నులకు చేరింది.
నర్సరీల ద్వారా ఒక్క నెలలోనే సుమారు 3.50 లక్షల ఆయిల్‌పామ్ మొక్కలను పంపిణీ చేసింది. రైతులకు ట్రైకోడెర్మా, వామ్స్ వంటి జీవ ఎరువులను 50 శాతం సబ్సిడీపై అందించే ప్రణాళిక రూపొందించింది. యంత్ర పరికరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
విజయ బ్రాండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఉత్పత్తి, ప్యాకింగ్, పంపిణీని మరింత విస్తరించేందుకు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన విజయ వంట నూనెలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది.
ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ అప్పారావుపేటలో 90 టీపీహెచ్, అశ్వారావుపేటలో 30 టీపీహెచ్, నర్మెట్టలో 30 టీపీహెచ్ సామర్థ్యంతో మూడు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. నర్మెట్ట యూనిట్‌ను భవిష్యత్తులో 120 టీపీహెచ్ సామర్థ్యానికి విస్తరించే అవకాశముంది. అశ్వారావుపేటలో అదనంగా 60 టీపీహెచ్, బీచుపల్లిలో 30 టీపీహెచ్, మహబూబాబాద్‌లో 30 టీపీహెచ్ సామర్థ్యంతో మరో మూడు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది.
కల్లూరుగూడెంలో 15 టీపీహెచ్ సామర్థ్యంతో నిర్మించిన మరో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో దీనిని 60 టీపీహెచ్ సామర్థ్యానికి విస్తరించనున్నారు.మల్టీపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ ప్లాంట్లను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానం ద్వారా వ్యర్థ జలాల సమర్థవంత నిర్వహణ చేస్తున్నది.






కామెంట్‌లు (0)