Magazines

భావితరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ

4 గంటల క్రితం

India’s Future City
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 4 నిమిషాల చదవడం

పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేలా... సుస్థిరాభివృద్ధికి పెద్దపీట

ఇక్కడ పెట్టుబడులు పెట్టండి... అన్ని విధాలా సహకరిస్తాం

భార‌త్ స‌మ్మిట్‌-2.0లో 'ఫ్యూచర్ సిటీ -ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌'పై 
చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు

న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్

భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా... నెట్‌జీరో లక్ష్యంతో, పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. ‘భారత్ సమ్మిట్-2.0’లో భాగంగా 'ఫ్యూచర్ సిటీ -పట్టణీకరణ' అనే అంశంపై శుక్రవారం హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు ఆయా కాలాల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా నిలిచాయన్నారు. మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. దీన్ని కేవలం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా కాకుండా... ప్రజలు నివసించేందుకు, పనిచేసేందుకు, చదువుకునేందుకు, పరిశోధనలు చేసేందుకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే సమగ్ర నగరంగా తీర్చిదిద్దుతున్నామని వెల్ల‌డించారు.

వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, సౌర విద్యుత్, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఏఐ, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని వివ‌రించారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో అమెజాన్, హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, మారుబెనీ, సెమ్‌కార్ప్, ఎన్‌టీటీ తదితర సంస్థలు ఉన్నాయని చెప్పారు.

దేశ పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి ఒక కొత్త నమూనాగా నిలవబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సంద‌ర్భంగా ఆహ్వానించారు. భూ కేటాయింపుల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతుల వరకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చర్చాగోష్ఠిలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సీఈవో విజయ్ మహాజన్, సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్, ప‌ట్ట‌ణీక‌ర‌ణ అంశాల‌పై నిపుణుడు టికేందర్ సింగ్ పవార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ షేక్ సలావుద్దీన్, ప్రముఖ చరిత్రాకారులు సజ్జద్ షాహిద్, మాజీ ఎంపీ దివ్యా స్పందన తదితరులు పాల్గొన్నారు.


India’s Future City is for the generations to come.అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫ‌లాలు

భారత్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ – ఆర్థిక న్యాయంపై మహేష్ కుమార్ గౌడ్

సమాన అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోస‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ కోవ‌లోనే త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే త‌మ లక్ష్యమ‌ని ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో కొన‌సాగుతున్న భార‌త్ స‌మ్మిట్‌-2.0లో భాగంగా ‘తెలంగాణ రైజింగ్‌-ఆర్థిక న్యాయం’ అనే అంశంపై శుక్ర‌వారం నిర్వ‌హించిన చ‌ర్చాగోష్టిలో మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆదిలాబాద్, ములుగు, నారాయణ పేటలాంటి వెనుక‌బ‌డిన‌, మారుమూల ప్రాంతాల‌కు కూడా ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆదాయంలో 40 శాతం హైదరాబాద్ నుంచే వ‌స్తోందని తెలిపారు. ఇది అభివృద్ధిలో అస‌మ‌తుల్య‌త‌కు నిద‌ర్శ‌మ‌ని చెప్పారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభ‌మైన

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పేద‌ల‌కు వంద రోజులు ప‌ని క‌ల్పించ‌ట‌మే ల‌క్ష్యంగా కొన‌సాగిందని ఆయ‌న గుర్తు చేశారు. అద్భుతమైన ఆ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నదే నెహ్రూ ఆశయమ‌ని, అందుకు భిన్నంగా మోడీ స‌ర్కార్ సంపన్నులకే ప్రాధాన్యతనిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 80 వేలకు పైగా ఉద్యోగాల‌ను ఇచ్చామ‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడితే.. ఆ అప్పులకు ఏటా రూ.6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామ‌ని వివ‌రించారు. అప్పుల భారం ఉన్నా సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాల‌నే సంక‌ల్పంతో ఇందిరమ్మఇండ్ల‌ను ప్రారంభించామ‌ని చెప్పారు. దాదాపు 70 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.


India’s Future City is for the generations to come.సామాజిక న్యాయానికి మా ప్ర‌భుత్వ‌మే ఛాంపియ‌న్

సబ్బండ వర్గాలకు సమాన అవకాశాలు క‌ల్పిస్తాం : చ‌ర్చాగోష్టిలో మంత్రి సీత‌క్క

సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం ఒక సిద్ధాంతం కాదని, తరతరాలుగా వివక్షకు గురైన వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే బాధ్యతని ఆమె స్పష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో కొన‌సాగుతున్న భారత్ సమ్మిట్–2.0లో భాగంగా శుక్ర‌వారం ‘సామాజిక న్యాయం’ అనే అంశంపై నిర్వ‌హించిన చ‌ర్చ‌గోష్టిలో సీతక్క ప్రసంగించారు. తెలంగాణలోని ఒక మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి నేడు మంత్రిగా ప్రజల ముందు నిలబడటం తన జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, విద్య, ప్రజాసేవల ఫలితమని తెలిపారు. తనలాంటి గ్రామాల్లో ఎంతోమంది అమ్మాయిలకు ఎన్నో కలలు ఉన్నాయని, కానీ సరైన అవకాశాలు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదని అన్నారు. ప్రతిభ లేక వెనుకబడటం లేదని, అవకాశాలు అందక వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం, ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించడమేనని, వ్యక్తి విలువను కులం ఆధారంగా దాన్ని నిర్ణయించకూడదని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కేవలం మంచి ఉద్దేశాలు సరిపోవని, విధానపరమైన, నిర్మాణాత్మక మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఒక సమాజం సాధించిన అభివృద్ధిని ఆ సమాజంలోని మహిళల పురోగతి ఆధారంగా అంచనా వేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, ఉపాధి కల్పించేవారు, నిర్ణయాధికారులు, నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనాల ద్వారా గ్రామీణ మహిళలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలు అవకాశాల కోసం గ్రామాలను వదిలి వెళ్లకుండా, అవకాశాలే వారి వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

​


​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్