ఉపాధి దొరికే ప్రాంతాల్లోనే గృహ నిర్మాణాలు
నియోజకవర్గానికి 5,500 ఇండ్లు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్
నాంపల్లి గృహకల్పలో నాలుగు నియోజకవర్గాల ఇండ్లకు ‘ఈ-లాటరీ’
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో గుడిసెలు లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని బీసీ సంక్షేమ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో మంగళవారం గోషామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు సంబం ధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపి కను కంప్యూటరైజ్డ్ ‘ఈ-లాటరీ’ ద్వారా మంత్రి ప్రారం భించారు. లాటరీలో ఎంపికయిన కోమల్, బచల చైతన్య, మధుగుల మమత, గ్యాదరి నందిని, చిన్న పగ వీరమణి, అమరకీర్తి తదితర లబ్దిదారుల పేర్లను చదివి వినిపించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే బోనాల నాటికల్లా గృహ ప్రవేశాలు..
హైదరాబాద్ వంటి మహానగరంలో స్థలాల లభ్యత తక్కువగా ఉన్నందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను పేదల నివాసాల కోసం వినియోగిస్తూ ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను నిజం చేసే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఆర్టీసీ భూములను కూడా ఇచ్చామని, అలాగే పోలీసు శాఖకు చెందిన భూములను సైతం వినియోగిస్తున్నామని అన్నారు. మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు అనువైన భూములన్నిటినీ కూడా సేకరిస్తున్నామని చెప్పారు. వచ్చే బోనాల నాటికల్లా గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేడు లాటరీ తీసిన ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రజలకు ఎక్కడ జీవనోపాధి ఉంటుందో అక్కడే గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులూ ప్రభుత్వం అందిస్తుందని, పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గానికి రెండు విడతల్లో ఇండ్లు
ప్రజా ప్రభుత్వంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ 5,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. తొలి దశలో 3,500, రెండో దశలో 2,000 ఇండ్లు మంజూరు చేశామన్నారు. మొదటి దశ పనులు చాలావరకు పూర్తికాగా, దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం, స్థల సమస్య దృష్ట్యా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్య మిస్తున్నామన్నారు. ‘ఎల్-1’ కేటగిరీ కింద సొంత స్థలం ఉన్న దాదాపు 2 వేల మందికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళలు సంఘాల్లో చేరాలి..
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు. మహిళా సాధికారత కోసం రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. హైదరా బాద్ నగరంలో మహిళా సంఘాల్లో సభ్యత్వం తక్కువగా ఉందని, అర్హులైన మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)