ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరలు, సామాజిక పింఛన్లతో పేదల సంక్షేమానికి పెద్దపీట : మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన మహానేత ఇందిరాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నవంబర్ 19న (నేడు) జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, భూ సంస్కరణలు, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ఆమె దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మార్గదర్శకమనీ, ఆమె పేరుతో తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం పట్ల అభినందనలు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
అలాగే తెలంగాణ ఆడపడుచులకు ఆత్మ గౌరవం, ఆత్మీయతకు ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. హిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సామాజిక పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తూ వారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందనీ, గతంలో ఇందిరాగాంధీ పేదల పక్షాన నిలబడి దేశంలో సంక్షేమ పాలనకు బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్ఫూర్తితో ప్రజా పాలనను కొనసాగిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం అనేది కేవలం ఎన్నికల హామీ కాదు.. అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత అని చెప్పారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, మహిళలకు భద్రత కల్పించడం, వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం అందిం చడం, ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరాగాంధీకి మనం అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణను సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.






కామెంట్లు (0)