యూఎస్ నౌకాదళ కార్యదర్శి హంగ్ కావో
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'కి సంబంధించి యూఎస్ నౌకాదళ తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో కాలం చెల్లిన ఆయుధాలను వాడినట్లు చెప్పారు. చాలా ఆయుధాలు 'కోడ్ ఎకో' 'కోడ్ ఫాక్స్‌ట్రాట్' శ్రేణికి చెందినవని తెలిపారు. వాటి కండిషన్ కోడ్‌లను మార్చి తిరిగి వినియోగించినట్లు చెప్పారు. బ్రెడ్ పాతబడిన మాత్రాన దాన్ని పూర్తిగా పారేయాల్సిన అవసరం లేదని, కొద్దిగా నీళ్లు చల్లి మైక్రోవేవ్‌లో 15 సెకన్ల పాటు వేడి చేస్తే మళ్లీ తినడానికి అనువుగా మారుతుందని పేర్కొన్నారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఉపయోగించిన ఆయుధాల లభ్యత గురించి సెనెట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ హంగ్ కావో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు ముగిసిన మందుగుండు సామగ్రిని మోహరించే ముందు రీకోడ్ చేశారని కావో చెప్పారు. ఆ ప్రక్రియను వివరించడానికి ఆయన తన చిన్ననాటి విషయాన్ని పంచుకున్నారు. "నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మాకు సంబంధించినంత వరకు బ్రెడ్ వంటి వాటికి గడువు ముగియదు. వాటిపై కొంచెం నీళ్లు చల్లితే చాలు, దాన్ని మళ్లీ తినవచ్చు. అలాగే, మందుగుండు సామగ్రిలో కొన్నింటిని మేం రీకోడ్ చేశాం. అందువల్ల గడువు ముగిసిన మందుగుండు సామగ్రిని కూడా మేం ప్రయోగించగలిగాం" అని ఆయన సెనేట్ ప్యానెల్‌కు చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఏయే రకాల ఆయుధాలు ఉన్నాయో, ఎన్ని గడువు ముగిసిన ఆయుధాలను ఉపయోగించారో కావో వెల్లడించలేదు.
ఇరాన్పై అమెరికా ఉపయోగించిన ఆయుధాలు ఇవే!
ఇరాన్‌పై దాడులకు ఉపయోగించిన ఆయుధాలను, తమ టార్గెట్లను గతంలో అమెరికా సెంట్రల్ కమాండ్ బహిర్గతం చేసింది. దాని ప్రకారం, బి-2 స్టెల్త్ బాంబర్లు, పేట్రియాట్ క్షిపణులు, లూకస్ డ్రోన్లు, థాడ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, ఎఫ్-16, ఎఫ్-18, ఎఫ్-22 ఫైటర్ జెట్లు, ఎ-10 అటాక్ జెట్స్, ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్స్, ఈఏ-18జీ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్ విమానం, పి-8 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌బార్న్ కమ్యూనికేషన్ రిలే, ఆర్సీ-135 నిఘా విమానం, ఎంక్యూ-9 రీపర్స్, ఎం-142 హైమొబిలిటీ రాకెట్ వ్యవస్థ, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, అణుశక్తి విమాన వాహక నౌక, రీఫ్యూయలింగ్ విమానాలు, రీఫ్యూయలింగ్ షిప్‌లు, సి-130 కార్గో విమానం, సి-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం వాడినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకోసం భారీ ఖర్చు
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికి అమెరికా భారీ స్థాయిలో ఖర్చు పెట్టిందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో దాదాపు 25 బిలియన్ డాలర్లు (2.30లక్షల కోట్లు) ఖర్చు పెట్టినట్లు అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ వివరాలను అమెరికా అధికారికంగా వెల్లడించడం అదే తొలిసారి. ఆ వ్యయంలో అధిక భాగం ఆయుధ సామగ్రి కోసమేనని పెంటగాన్ అధికారి పేర్కొన్నారు. మరోవైపు, యుద్ధం నేపథ్యంలో 200 బిలియన్ డాలర్లకుపైగా నిధులు ఇవ్వాలని అమెరికా పార్లమెంట్‌ను పెంటగాన్ కోరినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే 11 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఖర్చు చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.






కామెంట్‌లు (0)