Magazines

సాగర్‌‌‌లో సొరంగం తవ్వుతుంటే సోయిలేదా?

38 నిమిషాల క్రితం

Sagar
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 3 నిమిషాల చదవడం

ఏపీ జలదోపిడీ చేస్తుంటే ఏం చేస్తున్నారు : సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌‌పై 
కేటీఆర్‌ ఆగ్రహం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

నాగార్జునసాగర్‌లో భారీ సొరంగం నిర్మించి తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఏపీ యధేచ్చగా జలదోపిడీకి పాల్పడుతుంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తాగునీటి పథకం పేరుతో ఎలాంటి అనుమతుల్లేకుండా డెడ్ స్టోరేజ్ నుంచి తొమ్మిది టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. జలదోపిడీ చేస్తుంటే, సొరంగం తవ్వుతుంటే ఈ ప్రభుత్వానికి సోయిలేదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం జలదోపిడీని వెంటనే ఆపాలని డిమాండ్‌‌ చేశారు.

బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ వద్ద ఏడాదిగా సొరంగం తవ్వుతూ, విజయపురి సౌత్ వద్ద 510 అడుగుల దిగువన నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వలేదా? నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు అందించలేదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందనీ, తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

అప్పుడు పోతిరెడ్డిపాడు ఇప్పుడు నాగార్జునసాగర్‌

తాగునీటి పథకం పేరుతో 1,650 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించి తొమ్మిది టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పేరుకు తాగునీటి పథకమైనప్పటికీ, దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, తెలంగాణకు చెందిన నీటి హక్కులను దెబ్బతీసే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. గతంలో సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడు వద్ద గండి కొట్టి శ్రీశైలం నుంచి నీటిని తరలించారనీ, ఇప్పుడు నాగార్జునసాగర్ వద్ద అదే తరహా జలదోపిడీకి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు చేసిన ద్రోహం కంటే నేడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మరింత తీవ్రమైనదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిత్యనాథ్‌ ‌దాస్‌‌కు సలహాదారు పదవి ఎందుకు?

ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారిని సాగునీటి సలహాదారుగా నియమించుకోవడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్ర సాగునీటి సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారని అడిగారు. ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈఎన్సీ రమేశ్‌బాబును ఉద్యోగ విరమణ అనంతరం తిరిగి నియమించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

కేఆర్ఎంబీ వద్ద తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఏం చేశారు?

ఏపీ చేపడుతున్న నీటి తరలింపును అడ్డుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలనీ, ఏపీ చేపడుతున్న నీటి తరలింపును అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా లేదా స్పష్టం చేయాలని కోరారు. హైదరాబాద్‌తోపాటు పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం

కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్‌‌ పార్టీ అన్యాయం చేస్తూనే ఉందని కేటీఆర్‌ ‌విమర్శించారు. 1930లోనే నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం వద్ద 161 టీఎంసీల సామర్థ్యంతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును కిందికి మార్చి నందికొండ వద్ద నాగార్జునసాగర్ నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రతిపాదిం‌చి లంగాణకు ద్రోహం చేసిందన్నారు. తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు అందడం లేదని చెప్పారు. ఏపీకి 15.5 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టు రూపుదిద్దుకుందని వివరించారు. పాలమూరు, నల్లగొండ జిల్లాలకు కాంగ్రెస్, టీడీపీ పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పే రేవంత్ రెడ్డి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల పనులను ఎందుకు నిలిపేశారనీ, టెండర్‌‌ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.

చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న రేవంత్‌‌రెడ్డి

చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి హక్కుల విషయంలో మౌనం పాటిస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జునసాగర్‌లో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సాగర్‌లో జల దోపిడీ జరుగుతున్నా తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

జలదోపిడీని అడ్డుకునే వరకు పోరాటం

నాగార్జునసాగర్‌లో జరుగుతున్న అక్రమ నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామనీ, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రైతులను, ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు. నల్లగొండడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ నీటి హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతామని అన్నారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున లేఖ రాస్తామనీ, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జి జగదీశ్‌‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ ‌యాదవ్‌, రవీంద్ర నాయక్‌, గ్యాదరి కిశోర్‌, హర్షవర్ధన్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్