Magazines

ఇంటర్ విలీనంపై చర్చించాలి : డీటీఎఫ్‌

24 నిమిషాల క్రితం

Need to discuss the merger of Intermediate education: DTF
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కూలంకుశంగా చర్చించి పరిష్కార మార్గాలపై స్పష్టత వచ్చాకే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనంపై నిర్ణయం తీసుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) సూచించింది. ఆదివారం హైదరాబాద్ లో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సోమయ్య, లింగారెడ్డిలు మాట్లాడుతూ విలీనంతో వివిధ క్యాడర్ల ఉపాధ్యాయులు, ఉద్యోగుల మధ్య తలెత్తే సర్వీస్ సంబంధ సమస్యలు, అర్హతలు, అధికారాల విభజనతో పాటు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీల నిర్వహణలో తలెత్తే సమస్యలన్నింటిపై చర్చించాల్సి ఉందన్నారు. వీటన్నింటిపై సంబంధిత సంఘాలు, మేధావులు, నిపుణులతో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ గడువు ముగిసి 40 నెలలు అవుతుందనీ, 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయనీ, హెల్త్ కార్డులు సరిగా పని చేయడం లేదనీ, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2003 డీయస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఏపీలో మాదిరిగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల పత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎన్.ఎస్.ఎస్. శర్మ, కె.లక్ష్మారెడ్డి, కె .నారాయణ రెడ్డి, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. కిష్టప్ప, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం. రాఘవాచారి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవిచందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.రాజిరెడ్డి, టి.శ్రీశైలం, చాప బాబుదొర, పి.సృజన, పి.దాసు, ఎం.సామ్యూల్, జె.రామస్వామి, ఎ.శ్రీనివాస్ రెడ్డి, ఆర్.లింగయ్య, పి.శ్యామ్ లు విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్