సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి
ధర్మపురిలో ఘనంగా ‘ప్రజా చైతన్య సభ’
నవతెలంగాణ - ధర్మపురి
దేశ సంపదగా ఉన్న లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టే ప్రయివేటీకరణ విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ’లో ఆయన ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లను ఏకపక్షంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ‘జెన్-జీ’ ఆందోళనలు, ఉద్యమాలు కేంద్ర పాలకులకు గట్టి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ సర్కారును గద్దె దించే స్థాయికి ప్రజా ఉద్యమాలు చేరుకుంటాయని హెచ్చరించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటు తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికీ నెలకు 10 కిలోల బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి, రోజువారీ వేతనాన్ని కనీసం రూ.700గా నిర్ణయించాలని, పట్టణ ప్రాంత నిరుపేదలకూ ఈ చట్టాన్ని వర్తింపజేయాలని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. పాలకుల ప్రచార ఆర్భాటాలు తప్ప సామాన్య ప్రజల జీవితాల్లో ఎటువంటి గుణాత్మక మార్పూ రాలేదని, కార్పొరేట్ అనుకూల విధానాలను నిలదీయడమే మార్క్సిస్టుల లక్ష్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న భూమి, ఉపాధి, విద్యా, వైద్య సమస్యలపై తమ పార్టీ రాజీలేని ఉద్యమాలు నిర్మిస్తుందని చెప్పారు. సభలో గాయకులు చుక్కా రాంనర్సయ్య తన గళంతో ఉత్తేజపరిచారు. అంతకుముందు ధర్మపురి బస్టాండ్ నుంచి ప్రారంభమైన భారీ ప్రదర్శన పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగి సభా ప్రాంగణానికి చేరుకుంది. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు భూతం సారంగపాణి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్, నాయకులు నాయిని శారద, ఇందూరి సులోచన, బచ్చల వినోద్, మహమ్మద్ అబ్దుల్ చౌదరి, కుంచం శంకర్, ఎస్ఎఫ్ఐ నాయకులు సుద్దాల అమితేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్లు (0)