సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలతోపాటు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. బుధవారం నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా దాదాపు గంటకుపైగా జరిగిన చర్చల్లో పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ సమస్యలు వారు చర్చించారు. ముఖ్యంగా పీఆర్సీ రిపోర్ట్ ను వెంటనే తెప్పించుకొని మంచి ఫిట్ మెంట్ తో అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్ లోవున్న డీఏలను, వివిధ రకాల బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు. హెల్త్ కార్డుల అమలుపై ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 15వ తేదీ లోపు తన సమక్షంలోనే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో చికిత్స అందే విధంగా ఒప్పందాలు జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2003 డీయస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ తో సమావేశపరిచి సమస్య పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీల అప్ గ్రెడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వినతిపత్రం ఇవ్వగా వారం రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సీఎంఓ ప్రత్యేక అధికారి వేముల శ్రీనివాస్ ను ఆదేశించారు. సర్వశిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న ఐ.ఇ.ఆర్.పీలకు కనీస పే స్కేల్స్ వర్తింపచేయా లని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల ని కోరగా తదుపరి విద్యాశాఖ సమీక్షలో ఈ అంశాన్ని చేర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీపీఎస్ రద్దుకై కమిటీ నియామకం, జి.ఓ. 25ను సవరించాలని, బి.ఇడి. అర్హతగల యస్.జి.టి. ఉపాధ్యాయులకు పి.యస్. హెచ్.యం. పదోన్నతి కల్పించాలని, వచ్చే వేసవిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరగా అన్నింటిపై సానుకూలంగా స్పందించారని పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి బట్టాపురం మధుసూధన్ రెడ్డి, అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్, నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు బి. జగన్మోహన్ గుప్త తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)