Magazines

ఆయిల్‌‌పామ్‌ సాగు విస్తరణే లక్ష్యం

1 గంట క్రితం

The goal is to expand oil palm cultivation.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలి : గోద్రెజ్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీలో మంత్రి తుమ్మల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేలా కంపెనీలు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేసిన సమీకృత ఆయిల్‌పామ్ యూనిట్‌కు, ఇప్పటికే అమలులో ఉన్న తెలంగాణ ఆహార శుద్ధి, పరిరక్షణ విధానం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక విధానం కింద లభించే ప్రయోజనాలకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ మంజూరుకు చొరవ తీసుకోవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. అదేవిధంగా యూనిట్‌కు అవసరమైన రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోతరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు అదనంగా 35 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఆధునిక ఆయిల్‌పామ్ మిల్లును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కంపెనీకి అదనపు జిల్లాలను కేటాయించాలనీ, ఆయిల్‌పామ్ గెలల ధరలను నిర్ణయించే సమయంలో కంపెనీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. అంజనాపురం ఆయిల్‌పామ్ యూనిట్‌కు సంబంధించిన రహదారి విస్తరణ, భూమి కేటాయింపు తదితర అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫెడ్ ఎమ్‌‌డీ యాస్మిన్ బాషా, గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎమ్‌‌డీ, సీఈఓ సునిల్ కటారియా, గ్రూప్ హెడ్ కార్పోరేట్ అఫైర్స్ రాకేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్