Magazines

ఇంటర్ విద్య రద్దుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

2 రోజుల క్రితం

Intermediate education.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

విద్యార్థులు, అధ్యాపకుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి

జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రీకరణ, ప్రయివేటీకరణను ప్రోత్సహించొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వం సమగ్ర విధానాన్ని ప్రకటించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ ‌రజినీకాంత్‌, టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1969 నుంచి కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో విస్తృత స్థాయిలో చర్చించాలని కోరారు.

విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా గొప్ప ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాటి అమలులో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు వంటి అనేక ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీవ్ర గందరగోళం ప్రకటనలు తప్ప అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు శూన్యం అని పేర్కొన్నారు.

ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల డ్రాప్‌అవుట్లు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, బోధనా సిబ్బంది గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గురుకుల, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు సహా అన్ని రకాల పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ఏ విధంగా సర్దుబాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అన్ని పాఠశాలల్లో సైన్స్, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులను అందుబాటులోకి తెస్తారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, పర్యవేక్షణ లోపం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయని తెలిపారు. పాఠశాల విద్యా ప్రమాణాలను పెంచకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకుండా కేవలం తరగతుల విలీనం ద్వారా డ్రాప్‌అవుట్లు తగ్గుతాయని భావించడం సరికాదని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో అవసరమైన ఉపాధ్యాయులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, తరగతి గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్