నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్మంతర్లో సీజేపీ నేతలు మెరుపు నిరసన చేపట్టారు. సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో జాతీయ జెండాలు చేతబట్టి ఆందోళన నిర్వహించారు. సుమారు 20 మంది సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జేడీయూ కార్యాలయ గేటు మార్గం ద్వారా సీజేపీ బృందం జంతర్మంతర్కు చేరుకుంది.
జంతర్మంతర్లో నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీజేపీ నేతలు గతంలోనే ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. 24 గంటల్లో నిర్ణయం ప్రకటించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయితే దరఖాస్తు సమర్పించిన గంటలోపే అక్కడ నిరసనలకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
దశాబ్దాలుగా నిరసనలకు వేదికగా ఉన్న జంతర్మంతర్ను అధికారిక నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించినట్లు ఇటీవల ప్రకటించారు. దాని స్థానంలో రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్లను కొత్త నిరసన వేదికలుగా ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించనున్నారు.
పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న జంతర్మంతర్ను నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడంపై చర్చ జరుగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.







కామెంట్లు (0)