Magazines

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

17 గంటల క్రితం

SATYANARAYANA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడం కళారంగంలో విషాదాన్ని నింపింది. బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హకీంపేటలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తన కళా ప్రదర్శనను ముగించుకున్న సత్యనారాయణ కారులో హయత్‌నగర్‌ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాం ఆచూకీ కోసం విచారణ చేస్తున్నారు.

సత్యనారాయణ గత 15 ఏళ్లుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ రంగాల్లో కళాకారుడిగా కొనసాగుతున్నారు. తన ప్రతిభతో ఇప్పటివరకు 2 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఆయన పలువురిని అలరించారు. వివిధ కార్యక్రమాల్లో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందారు. కళాకారుడిగా కొనసాగుతున్న సత్యనారాయణ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహచర కళాకారులను తీవ్ర విషాదంలో ముంచింది. సత్యనారాయణ మృతిపై తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణుతో పాటు పలువురు కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని పేర్కొంటూ సంతాపం తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్