- రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట..రాయికల్‌లో భారీ రైతు సదస్సు
- చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఉద్యమిద్దాం..రాయికల్ సభలో పిలుపు
నవతెలంగాణ - రాయికల్
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు ర్యాలీ, రైతు సదస్సు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాలు, ఫ్లకార్డులతో గాంధీ విగ్రహం నుంచి అంగడి బజార్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సదస్సుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ దావా వసంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను నీరుగార్చడంతో పాటు వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ట్రాక్‌షీట్, ధర్మకాంట తూకాల మధ్య వ్యత్యాసాల వల్ల రైతులు నష్టపోతున్నారని, ఆ మొత్తాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత కరువు పరిస్థితుల్లో మరింత స్పష్టమవుతోందని పేర్కొన్న ఆయన, కన్నెపల్లి పంపు నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన జీవన్‌రెడ్డి, రెండేళ్ల కాలంలో కొబ్బరికాయలు కొట్టడం మినహా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని అన్నారు. మల్లాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.... కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా అమలు చేశారని తెలిపారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, యూరియా పంపిణీలోనూ సమస్యలు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ దావా వసంత మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలతో రైతు కుటుంబాలకు భరోసా కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనిల్, మల్లేష్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ తురగ సౌజన్య, మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మ్యాకల రమేష్, రాకేష్ నాయక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)