Magazines

'తాన్ల' ఫౌండేషన్ దాతృత్వంతో రూ. 300 కోట్లతో 5,000 ఇండ్ల నిర్మాణాలు 

1 గంట క్రితం

Tanla
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

​నవతెలంగాణ-సత్తుపల్లి

​సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఉచితంగా 5,000 ఇళ్లను నిర్మించేందుకు తాన్ల ఫౌండేషన్ ఉదయ్ కుమార్ రెడ్డి రూ. 300 కోట్లు కేటాయించారని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్ల ఫౌండేషన్ నడుపుతున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబరేటరీలను మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో ఇళ్లను నిర్మించి ఇస్తానని ముందుకు వచ్చారని పేర్కొన్నారు.


రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ గృహ నిర్మాణాలకు భూమి పూజ నిర్వహిస్తామని ప్రకటించారు. అర్హులైన నిరుపేదలకు స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను మంత్రి గంగారం వేదిక నుంచి ఆదేశించారు.

​నారాయణపురం గ్రామంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యమందించే కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని మంత్రి వెల్లడించారు. పేదలకు సేవ చేసే ఇటువంటి ఆసుపత్రులు, ఫౌండేషన్లకు ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, సంపాదించిన సొమ్మును సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడం అభినందనీయమని కొనియాడారు.


బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నెలకు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు ఖర్చవుతుండగా, కేవలం 5 నెలల వ్యవధిలోనే రూ. 9 కోట్ల విలువైన మందులను పేదలకు ఉచితంగా అందించడం గొప్ప విషయమని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ... గంగారంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజల అదృష్టమని తెలిపారు. గతంలో HbA1c వంటి పరీక్ష నివేదికల కోసం మూడో రోజు వరకు వేచి చూడాల్సి రాగా, ఇక్కడ 10 నిమిషాల్లోనే కచ్చితమైన నివేదికలు వస్తున్నాయని ప్రశంసించారు. ఉచిత వైద్యం ద్వారా ప్రతి పేద కుటుంబానికి నెలకు వేల రూపాయలు ఆదా అవుతున్నాయని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ఉదయ్ కుమార్ రెడ్డి, మహీల్ రెడ్డిలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సీపీ సునీల్ దత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్